మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఐదారు నెలల్లో అందుబాటులోకి క్యాన్సర్ టీకా

మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఐదారు నెలల్లో అందుబాటులోకి క్యాన్సర్ టీకా

ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్): ఐదారు నెలల్లో మహిళలకు క్యాన్సర్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. మంగళవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‎లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘మహిళలను తీవ్రంగా వేధిస్తున్న క్యాన్సర్‎ను ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీపై పరిశోధనలు దాదాపు పూర్తికావొచ్చాయి. ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుంది. దీన్ని 9 ఏండ్ల నుంచి 16 ఏండ్లున్న బాలికలకు ఇస్తాం. ఇది రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుంది” అని ప్రతాప్ రావ్ జాదవ్ వెల్లడించారు. 

‘‘మన దేశంలో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. ఈ వ్యాధిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 30 ఏండ్లు పైబడిన మహిళలకు ఆస్పత్రుల్లో స్ర్కీనింగ్ నిర్వహించడంతో పాటు ఈ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది” అని తెలిపారు. క్యాన్సర్ ట్రీట్ మెంట్‎లో వినియోగించే మెడిసిన్స్‎పై కస్టమ్స్ డ్యూటీని ఇప్పటికే మినహాయించినట్టు చెప్పారు. కాగా, హెల్త్ కేర్ సెంటర్లను ఆయుష్ ఫెసిలిటీస్‎గా మార్చడంపై మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆస్పత్రుల్లో ఆయుష్ డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. ప్రజలు అక్కడ సేవలు పొందొచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 12,500 ఫెసిలిటీస్ ఉన్నాయి. రానున్న రోజుల్లో వాటి సంఖ్యను పెంచుతాం” అని జాదవ్ పేర్కొన్నారు.