కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ను ఓడిస్తం : పురుషోత్తం రూపాల

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడించేది, తెలంగాణకు బీసీని సీఎం చేసేది బీజేపీ పార్టీయేనని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నామినేషన్​ ప్రోగ్రామ్​కు ఆయన హాజరయ్యారు. నామినేషన్​ వేసిన తర్వాత పార్టీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎంతో పాటు మరో పార్టీ స్టేట్ ప్రెసిడెంట్​ను ఓడించే అవకాశం బీజేపీకి వచ్చిందన్నారు. మేమెంతో మాకంతా నినాదంతో ఉన్న బీసీలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగులు గోస పడుతున్నారని, వారి గోసకు కారణమైన కేసీఆర్​ను కామారెడ్డి గడ్డ మీద ఓడించి తీరుతామన్నారు. సీఎంగా కేసీఆర్​ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వరన్నారు. కామారెడ్డి ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే వెంకటరమణారెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సబ్​కా సాత్, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్​ బీజేపీ నినాదమన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్​ ఇచ్చిందన్నారు.

పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎవరికి రాని అవకాశం కామారెడ్డి ప్రజలకు వచ్చిందని పేర్కొన్నారు. రెండు పార్టీల ప్రెసిడెంట్లను ఓడించే బీజేపీ బలాన్ని నిరూపించాలన్నారు. అక్కల్​కోట ఎమ్మెల్యే కల్యాణ్​శెట్టి, పార్టీ  వరంగల్​ ఇన్​చార్జి  మురళీధర్​గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  నీలం చిన్న రాజు, జిల్లా జనరల్ సెక్రెటరీ తేలు శ్రీనివాస్, ఫ్లోర్​లీడర్​మోటూరి శ్రీకాంత్​, అసెంబ్లీ కన్వీనర్​లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.