కోల్‌బెల్ట్, వెలుగు: కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా రెండు రోజుల పర్యాటనతో మంచిర్యాల జిల్లాలోని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. గురువారం రాత్రి నస్పూర్ గెస్ట్‌హౌజ్‌కు చేరిన మంత్రి, శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో బీజేపీ శక్తి కేంద్రాల ఇన్చార్జిలతో, పైస్థాయి లీడర్లు, వివిధ విభాగాల బాధ్యులతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించే వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
బూత్‌కమిటీల అవశ్యకత, వాటిని పూర్తి చేయాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. శక్తి కేంద్రాల ఇన్చార్జీల మీటింగ్‌కు హాజరైన కేంద్ర మంత్రికి పార్టీ శ్రేణులు, మహిళలు మంగళహారులు, బాణసంచా పేల్చుతూ ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. పాత మంచిర్యాల, హామాలీవాడల్లో మంత్రి స్థానికులతో మాట్లాడారు. మళ్లీ కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ వస్తుందంటూ పలువురు మంత్రితో మాట్లాడుతూ చెప్పారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బంగారి ప్రసాద్ అనే కార్యకర్త ఇంట్లో కేంద్ర మంత్రి భోజనం చేశారు. కార్యకర్త ఇంట్లో భోజనం చేసేందుకు వెళ్లే మార్గంలోని క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద కేంద్ర మంత్రి కాన్వాయ్ కొద్దిసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుంది.
ఏడేండ్లుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో రైల్వే గేటు వద్ద స్థానికులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పర్యటన సందర్భంగా మంత్రికి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. బెల్లంపల్లి లో ఏకలవ్య మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎన్ఎస్యూఐ లీడర్లు వినతిపత్రం అందించారు. నేషనల్ హైవేలు 63, 363లను కలుపుతూ కొత్తగా మంచిర్యాల ముల్కల నుంచి తిమ్మాపూర్ మీదుగా కుర్మపల్లి వరకు నిర్మించనున్న బైపాస్ రోడ్డు తో తమ పంటపోలాలు కోల్పోవాల్సి వస్తుందని, బైపాస్ రహదారిని జిల్లా కేంద్రం మీదుగా ఏర్పాటు చేయాలని కొత్త, పాత తిమ్మాపూర్ గ్రామస్తులు విన్నవించారు.