నిర్మల్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ధీమా వ్యక్తం చేశారు. పార్ల మెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా నిర్మల్లోని మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో గురువారం కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. ప్రజలంతా కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలన వైపే మొగ్గుచూపుతున్నారని అన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలన్నారు. పార్టీ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ రమాదేవి, నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, మల్లారెడ్డి, రావుల రామనాథ్, బద్దం లింగారెడ్డి, పాయల్ శంకర్, పెంబి జడ్పీటీసీ భూక్యా జాను బాయ్, అసెంబ్లీ కన్వీనర్లు పాల్గొన్నారు.
ఇంటింటికి వెళ్లి మట్టి సేకరణ
నేరడిగొండ : నేరడిగొండ మండలంలోని బుర్కపల్లి గ్రామంలో నిర్వహించిన నా మట్టి నా దేశం కార్యక్రమంలో పురుషోత్తం రూపాల పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మనిచ్చిన నేల తల్లిని, స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పించిన దేశాన్ని గౌరవించుకునేలా చేపట్టిన నా మట్టి-నా దేశం కార్యక్రమం ఎంతో మహోన్నతమైనదని అన్నారు. అనంతరం రాష్ట్రంలోనే ఎత్తైన కుంటాల జలపాతాన్ని సందర్శించారు.