పాలమూరు– రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం: కేంద్ర మంత్రి రాజ్ భూషణ్‌‌

పాలమూరు– రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం: కేంద్ర మంత్రి రాజ్ భూషణ్‌‌

న్యూఢిల్లీ, వెలుగు: పాలమూరు -రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను తిప్పి పంపించినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు విషయంలో న్యాయపరమైన చిక్కులు, టెక్నికల్ అంశాలు ఉన్నాయని పేర్కొంది. కరువు ప్రాంతంలోని 12 లక్షల ఎకరాలకు సాగు నీరు, ప్రజలు, పరిశ్రమలకు మంచి నీరు అందించే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని గురువారం కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌‌సభలో లేవనెత్తారు. 

ఇందుకు కేంద్ర జల శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్‌‌ స్పందిస్తూ.. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్  సెప్టెంబర్ 2022లో సాంకేతిక, ఆర్థిక అంచనాల కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి పంపిందని తెలిపారు. అయితే.. కృష్ణానది వివాదాల అంశం ప్రస్తుతం కోర్టుల్లో ఉందన్నారు. అందువల్ల ప్రస్తుతానికి సాంకేతిక, ఆర్థిక అంచనా సాధ్యం కాదని, ఈ ప్రక్రియ చేయకుండా జాతీయ హోదా ఇవ్వలేమని ఆయన తేల్చి చెప్పారు.