కేసీఆర్‌‌ పాలనలో తెలంగాణ దగా పడ్డది : రాజీవ్ చంద్రశేఖర్

  • కేంద్ర ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్ర శేఖర్‌

సూర్యాపేట, హుజూర్ నగర్, వెలుగు : సీఎం కేసీఆర్‌‌ తొమ్మిదేళ్ల పాలనలో  తెలంగాణ దగా పడ్డదని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.  సోమవారం సూర్యాపేట, హుజూర్‌‌నగర్‌‌లో  నియోజకవర్గ బూత్‌ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జులతో నిర్వహించిన మీటింగ్‌ పాల్గొని మాట్లాడారు. నీళ్లు,  నిధులు, నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌‌ కుటుంబం కమీషన్లు దండుకుని లక్షల కోట్లు దోపిడీ చేసిందని ఆరోపించారు. నియామకాలు చేపట్టక పోగా నిరుద్యోగ సమస్య పెరిగిందని మండిపడ్డారు. లిక్కర్ వినియోగంలో మాత్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని,  ఎమ్మెల్సీ కవిత దోచుకున్న డబ్బుతో ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసేందుకు బయల్దేరిందని ఎద్దేవా చేశారు.

 రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులు ఇస్తోందని, కేంద్రాని కంటే రాష్ట్రం రూపాయి ఎక్కువగా ఇచ్చినట్లు నిరూపిస్తే తాము  రాజీనామా చేస్తామని సవాల్ చేశారు. ఈ  కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌‌ రావు, అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి, స్టేట్ఎగ్జిక్యూటివ్ మెంబర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి,స్టేట్ కౌన్సిల్ మెంబర్ బాల వెంకటేశ్వర్లు, పార్లమెంటు ఎన్నికల ఇంచార్జ్ మధుకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, ఏపీ సంఘటన మంత్రి  మధుకర్ ఉన్నారు.