నేను సెప్టెంబర్ చివరి వారంలో జమ్మూకాశ్మీర్ వెళ్లాను. ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎన్నోసార్లు వెళ్లినా జమ్మూకాశ్మీర్‌ను సందర్శించడం మాత్రం ఇదే తొలిసారి. జమ్మూకాశ్మీర్ పర్యటన గురించి నా అనుభవాలను పంచుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఎందుకంటే- ఈ రాష్ట్రం తలరాతను మూడు జాగీర్దారీ కుటుంబాలు, బహుశా ఒక కేంద్ర మంత్రి సదా శాసిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రజానీకంతో సమానంగా కాశ్మీర్‌లోని ప్రజలందరికీ మెరుగైన భవిష్యత్తు అందించే దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆయన నేతృత్వంలోని మొత్తం 77 మంది మంత్రుల టీమ్ కృషి చేస్తున్నది.
జమ్మూకాశ్మీర్ పర్యటన సందర్భంగా శ్రీనగర్, బుడ్గావ్, బారాముల్లా జిల్లాలకు వెళ్లాను. ప్రధాని నిర్దేశానికి అనుగుణంగా నా కార్యక్రమాలన్నీ ప్రజలను కలవడం, వారితో మాట్లాడటమే కీలకంగా సాగాయి. అదేవిధంగా సవాళ్లు విసురుతున్న ప్రస్తుత కరోనా సమయంలో కొన్ని అభివృద్ధి పథకాలను ప్రారంభించాం. పర్యటన సందర్భంగా నా వెంట వచ్చిన ఓ పోలీసు అధికారితో మాట కలిపినప్పుడు ఆయన చెప్పిన విషయం టూర్ ముగిసే వరకూ నా మనసులోనే ఉండిపోయింది. “సరిహద్దు ఆవలి ఉగ్రవాదం, హింస ఫలితంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే 30 ఏండ్లు వెనుకబడిన తాము ఇకపై మెరుగైన జీవితం గడపగలమని మా రాష్ట్రంలోని యువత భావిస్తోంది” అని ఆయన అన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతున్నాయి.
అవకాశాలు కోల్పోయామన్నదే వారి ఆవేదన
యువత, పారిశ్రామికవేత్తలు, రైతులు, గిరిజన ప్రతినిధులు సహా మూడు జిల్లాల పాలనా యంత్రాంగంతో సమావేశాల్లో పాల్గొన్నాను. ప్రతి సమావేశంలోనూ సంభాషణలు, డిమాండ్లు, అభ్యర్థనలు అన్నీ కూడా వర్తమానం, భవిష్యత్తు ప్రధానంగానే సాగాయి. వారంతా అవకాశాలు కోల్పోయినందుకు బాధపడుతున్నారే తప్ప తాము నష్టపోయిన కాలం గురించి ఏ ఒక్కరూ విచారించడం లేదు. బుడ్గావ్, బారాముల్లా, శ్రీనగర్‌లో నాతో నవతరం విద్యార్థుల సమావేశాలన్నిటిలోనూ తమ నైపుణ్యాభివృద్ధి లేదా ఉద్యోగ అవకాశాలను ఎలా మెరుగుపర్చాలనే దానిపైనే చర్చ సాగింది. ఈ టూర్ సందర్భంగా నేను చరార్-ఎ-షరీఫ్ వద్ద నిర్మించిన కొత్త సబ్-డివిజన్ ఆస్పత్రిని పరిశీలించాను. ఈ ఆస్పత్రి నాణ్యతా ప్రమాణాలు, ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. సమర్థులైన, సానుకూల దృక్పథం గల సిబ్బందిని తగిన సంఖ్యలో నియమించారు. దీనివల్ల మారుమూల గ్రామాల ప్రజలకు సుదూరంలోని జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సిన బాధ తప్పింది.
ఉపాధి కల్పన కోరుకుంటున్నరు
బుడ్గావ్ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్లతో మాట్లాడినప్పుడు.. పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన యువతుల బృందం అక్కడ చర్చలో పాల్గొంది. ఈ సందర్భంగా వారంతా తమ చదువుకు కావాల్సిన అవసరాలను నా ముందుపెట్టారు. ఆ మేరకు “పాలిటెక్నిక్‌లో మా కోసం కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు మెకానికల్, సివిల్ డిప్లొమా కోర్సులు మాత్రమే ఉన్నాయి. మాకిప్పుడు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ కోర్సులు కూడా కావాలి” అని నిర్మొహమాటంగా, ఆత్మవిశ్వాసంతో నా ముందు డిమాండ్ ఉంచారు. అలాగే నేను వెళ్లిన అగ్రశ్రేణి ఐటీఐల్లో ఒకటైన బుడ్గావ్‌లోని ఐటీఐలో అత్యద్భుతమైన మోటార్ వెహికల్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ సదుపాయం ఉంది. అక్కడ జరిగిన సమావేశంలోనూ విద్యార్థుల నుంచి కొన్ని అభ్యర్థనలు వచ్చాయి. ఈ ప్రాంతంలో శిక్షణ పొందిన అనంతరం ఉపాధి కల్పన దిశగా ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాల్సిందిగా వారు కోరారు.
ఐటీ ఇండస్ట్రీలో చేరాలని..
మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా రూ.50,000 కోట్ల పెట్టుబడులపై చేసిన ప్రకటన గురించి వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. మూడంచెల పాలనా వ్యవస్థ ద్వారా ప్రజాధనం సద్వినియోగం చేయడంలో మోడీ ప్రభుత్వానికి గల రికార్డు దృష్ట్యా మునుపటి ప్రభుత్వాలతో పోలిస్తే ఇది భిన్నమైనదని వారు తెలుసుకున్నారు. తదనుగుణంగా ఈ నిధులతో ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడంతోపాటు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని వారు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలకు నైపుణ్యం ఒక మార్గంగా ఉండటమేగాక నైపుణ్యం--–ఉపాధి మధ్య బలమైన అనుసంధానంపై ప్రధాని మోడీ దూరదృష్టి గురించి నేను స్టూడెంట్లకు వివరించినప్పుడు వారిలో ఎంతో ఉత్తేజం కనిపించింది. ఇక్కడి యువత కూడా ఐటీ పరిశ్రమ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని అందులో చేరాలని కోరుకుంటున్నారు.
నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు
బారాముల్లా, బుడ్గావ్ జిల్లాల్లో రెండు ట్రెడిషనల్ స్కిల్ కాంప్లెక్స్‌లను పరిశీలించాను. అక్కడి పారిశ్రామిక వేత్తలు.. స్థానిక హస్తకళా నిపుణుల నైపుణ్యాన్ని వాడుకుంటూ తివాచీలు, కాగితం–-పిండిగుజ్జు ఉత్పత్తులు, దుస్తులు ఎగుమతి చేస్తుంటారు. అయితే, కొన్నేండ్లుగా ఇక్కడి హస్తకళా నైపుణ్యంతోపాటు కళాకారుల సంఖ్య కూడా తగ్గిపోయింది. జమ్మూకాశ్మీర్‌లో ఈ అందమైన ఉత్పత్తుల తయారీలో 25-–30 లక్షల మంది కళాకారులు ఉపాధి పొందుతున్నారు. అలాగే రూ.600 కోట్లకుపైగా విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా డిమాండ్ 10-–15 రెట్లు అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో సంప్రదాయ నైపుణ్యాలు, అనుబంధ పరిశ్రమల విషయంలో ప్రధాని ముందుచూపుతో ఈ సముదాయాలు, వ్యాపారాల వృద్ధికి అనుగుణంగా కళాకారుల నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని నేను హామీ ఇచ్చాను. కాగా, నేను నిర్వహించిన ఏ ఒక్క సమావేశంలోనూ ఉగ్రవాదం, భద్రతకు సంబంధించిన ప్రస్తావన వినిపించ లేదు. ఇలాంటి అద్భుతమైన అనుభవం నాకిదే తొలిసారి. శ్రీనగర్‌లో భయాందోళనకు నెలవైన లాల్‌చౌక్ ఇప్పుడు ప్రతి సాయంత్రం త్రివర్ణ పతాకం రెపరెపలతో, నిండుగా జన సంచారంతో కళకళలాడుతోంది.
యువతలో ఉత్తేజం నింపుతున్నం
ప్రజల హృదయాలు, మనసుల్లో ఆశలు-ఆకాంక్షలను ఏ మేరకు ప్రేరేపించగలరన్నది ఓ రాజకీయ నాయకుడి సామర్థ్యాన్ని అంచనా వేయగల కొలమానంగా నేను విశ్వసిస్తాను. ఆ విషయానికి వస్తే- గడిచిన 75 ఏండ్లలో ఎన్నడూలేని రీతిలో ప్రధాని మోడీ ఆ కొలమానంలోని సూచికను చాలా ఎత్తుకు తీసుకెళ్లారు. అలాగే ప్రజలను సురక్షితంగా ఉంచడంలో 24 గంటలూ కర్తవ్య నిర్వహణలో ఉండే కాశ్మీర్ పోలీసు--–భద్రత సిబ్బందితోపాటు పాలనా యంత్రాంగం తిరుగులేని కృషి, సేవాభావం, త్యాగాలు సామాన్యమైనవి కావు. మన పొరుగునే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ ఆశలు-ఆకాంక్షలను కాలరాసే అణచివేత పాలనపై మహిళలు, యువత పోరాడుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రధాని మోడీ ప్రభుత్వం యువతరం ఆశలు-–ఆకాంక్షలు మరింత పెంచుకునేలా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. దేశం స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలవైపు సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాత్రను దేశవ్యాప్తంగా యువతలో ఆశాభావం, ఉత్తేజం నింపే కరదీపికగా మలచారు. “అందరి తోడ్పాటుతో.. అందరి ప్రగతి.. అందరి విశ్వాసం.. అందరి కృషి” అన్న తిరుగులేని, అద్భుత తారకమంత్రం మనల్ని నవభారతం వైపు నడుపుతుండటమే ఇందుకు కారణం.
- రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి