అఫ్జల్​గురుకు పూలమాల వేయాల్సిందా?

అఫ్జల్​గురుకు పూలమాల వేయాల్సిందా?
  • ఒమర్ ​అబ్దుల్లా కామెంట్స్​పై రాజ్​నాథ్​ సింగ్​ ఫైర్​
  • టెర్రరిస్టులపై సానుభూతి చూపుతున్నారని మండిపాటు
  • భారత్​లో చేరాలని పీవోకే ప్రజలకు పిలుపు
  • జమ్మూకాశ్మీర్‌‌లో కేంద్ర మంత్రి ఎన్నికల ప్రచారం

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్​లో టెర్రరిస్టులపై నేషనల్​ కాన్ఫరెన్స్ ​పార్టీ సానుభూతి చూపుతున్నదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ మండిపడ్డారు. 2001లో పార్లమెంట్ మీద దాడి చేసిన దోషి అఫ్జల్‌‌ గురుకు మరణశిక్ష విధించటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ ఆ పార్టీ వైస్​ ప్రెసిడెంట్​ ఒమర్‌‌ అబ్దుల్లా ఇటీవల చేసిన కామెంట్స్​పై విరుచుకుపడ్డారు. “నేను ఒమర్​ అబ్దుల్లాను అడుగుతున్నా.. పార్లమెంట్​పై దాడిచేసిన టెర్రరిస్ట్​ అఫ్జల్​గురును ఉరితీయకుండా.. అతడికి పూలమాలలు వేయాలా?” అని ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్​లోని రామ్​బన్​ నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజ్​నాథ్​సింగ్​ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఆర్టికల్​ 370 పునరుద్ధరణ గురించి నేషనల్​కాన్ఫరెన్స్​మాట్లాడుతున్నది. కానీ.. గత ఐదేండ్లలో ఇక్కడ మేం 40వేల ఉద్యోగాలను సృష్టించాం” అని పేర్కొన్నారు. ఒకసారి ఇక్కడ బీజేపీ సర్కారు ఏర్పడితే  అభివృద్ధి పరుగులుపెడుతుందని చెప్పారు.

భారత్​లో చేరితే సొంత మనుషుల్లా చూస్తాం

పాక్​ఆక్రమిత కాశ్మీర్​(పీఓకే) ప్రజలు భారత్​లో చేరాలని రాజ్​నాథ్​సింగ్​ పిలుపునిచ్చారు. వారిని పాకిస్తాన్​ చూసినట్టు విదేశీయుల్లాగా కాకుండా.. సొంత మనుషుల్లాగా చూస్తామని చెప్పారు. ‘‘ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు జమ్మూకాశ్మీర్​ ప్రజలు సహకరిస్తే.. స్థానికంగా మరింత అభివృద్ధి చేస్తాం.

మాకు పాకిస్థాన్‌‌తో కలిసి ఉండడం ఇష్టం లేదు.. భారత్‌‌కు వెళ్తామని పీవోకేలోని ప్రజలు చెప్పేంత డెవలప్​మెంట్​చేసిచూపిస్తాం” అని స్పష్టం చేశారు. ఆర్టికల్​370ని పునరుద్ధరించాలనే నేషనల్​కాన్ఫరెన్స్​పార్టీ కల.. బీజేపీ ఉన్నంత వరకూ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ ఆర్టికల్​రద్దు చేసిన 2019 ఆగస్టు తర్వాత జమ్మూ కాశ్మీర్​లో ఎంతో మార్పు వచ్చిందని, ఇక్కడి యువత చేతిలో ఆయుధాలకు బదులు కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు పట్టుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు శ్రీనగర్​లో ప్రజలపై బుల్లెట్లు వదిలేందుకు ఎవరూ సాహసించడం లేదని అన్నారు.