తెలంగాణలో మాన్యువల్ స్కావెంజర్లు లేరు :మంత్రి రాందాస్ అథవాలే

తెలంగాణలో మాన్యువల్ స్కావెంజర్లు లేరు :మంత్రి రాందాస్ అథవాలే
  • లోక్‌‌‌‌సభలో ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో మాన్యువల్ స్కావెంజర్లు లేరని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. 2013, 2018లో నిర్వహించిన సర్వేల్లో ఈ విషయాన్ని ధ్రు​వీకరించినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు మంగళవారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం స్కీం(ఎస్ఆర్ఎంఎస్) కింద తెలంగాణకు కేటాయించిన నిధుల వివరాలు, లబ్ధిపొందిన మాన్యువల్ స్కావెంజర్లు వివరాలివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని వంశీకృష్ణ కోరగా, కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

తెలంగాణలో గతంలో నిర్వహించిన సర్వేల్లో మాన్యువల్ స్కావెంజర్లు లేరని తేలిందని సభకు తెలిపారు. ఎస్ఆర్ఎంఎస్‌‌‌‌లో భాగంగా మాన్యువల్ స్కావెంజర్లు, వారిపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ వృత్తుల్లో పునరావాసం కల్పించినట్లు చెప్పారు. ఇందుకోసం ఏపీతో పాటు దేశంలోని 13 రాష్ట్రాలకు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. 2017–18, 2019– 20 ఆర్థిక సంవత్సరంలో ఆయా రాష్ట్రాల్లో ఎవల్యూయేషన్ స్టడీ చేసినట్లు చెప్పారు.

దీని ఆధారంగా ఈ 13 రాష్ట్రాల నుంచి 3,813 లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు చేశామని వెల్లడించారు. ఇందులో 31–45 ఏండ్ల మధ్య వారు 45 శాతం, 46–60 ఏండ్ల మధ్య 25 శాతం మంది ఉన్నారని తెలిపారు. 56.5 శాతం మహిళా లబ్ధిదారులు, 47 శాతం నిరక్షరాస్యులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్ఆర్ఎంఎస్ కింద ఎలాంటి క్లైయిమ్స్‌‌‌‌ పెండింగ్‌‌‌‌లో లేవని తెలిపారు.