సికింద్రాబాద్/పంజాగుట్ట, వెలుగు: దివ్యాంగులకు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని, వారిలోని నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు తల్లిదండ్రులు సహకారం అందజేయాలని కేంద్రసహాయ మంత్రి రాందాస్ అథవాలే కోరారు. శుక్రవారం బోయిన్పల్లిలోని నిపిడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు బోధనా సామాగ్రి అందజేశారు.
ఈ సందర్భంగా రాందాస్అథవాలే మాట్లాడుతూ.. వికలాంగులు అనే పదం స్థానంలో ‘దివ్యాంగులు’ పదాన్ని వినియోగించడం సామాజిక పరంగా వచ్చిన మార్పునకు సూచన అన్నారు. అనంతరం క్రాస్ డిజెబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ను పరిశీలించిన మంత్రి నిపిడ్ సంస్థ అందిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను సమీక్షించారు. దివ్యాంగుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
అలాగే కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే హోటల్ టూరిజం ప్లాజాలో ఉన్నతాధికారులతో పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ‘వన్ నేషన్-వన్ఎలక్షన్’కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఆరా తీశారు. అనంతరం నాయకులతో సమావేశం నిర్వహించారు..