వరంగల్​ ఎయిర్ పోర్ట్​ను వంద శాతం పూర్తి చేస్తం: రామ్మోహన్ నాయుడు

వరంగల్​ ఎయిర్ పోర్ట్​ను వంద శాతం పూర్తి చేస్తం: రామ్మోహన్ నాయుడు
  •  
  • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ

వరంగల్  ఎయిర్​పోర్ట్​ విషయంలో తెలంగాణ ప్రభుత్వం క్రియాశీలకంగా  వ్యవహరిస్తున్నదని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.  భూసేకరణకు సర్క్యులర్ కూడా జారీ చేసిందని చెప్పారు. తన హయాంలో వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎంతో భేటీ అనంతరం రామ్మోహన్  మీడియాతో మాట్లాడారు. వరంగల్​లో  పూర్తిగా ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ద్వారా విమానాశ్రయాన్ని నిర్మించి చూపిస్తామని ఆయన చెప్పారు. 

వరంగల్ తోపాటు మరో మూడు  ఎయిర్​పోర్టులను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు వెల్లడించారు. ఈ ఎయిర్ పోర్ట్ ల విషయంలో ఫీజబిలిటీ స్టడీ చేయాల్సి ఉందని, వీటికి సంబంధించిన నివేదిక సానుకూలంగా వస్తే తర్వాత భూసేకరణకు వెళ్లొచ్చని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉందన్నారు. ఆ శాఖ నుంచి అనుమతి ఉంటే అక్కడ కూడా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని రామ్మోహన్​నాయుడు  క్లారిటీ ఇచ్చారు. ఆదిలాబాద్ కు ఓవైపు చత్తీస్​గఢ్​, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయని.. ఈ జిల్లాకు దరిదాపుల్లో విమానాశ్రయం లేదని, ఆదిలాబాద్ లో ఏర్పాటు చేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.