న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్కడ్పై ప్రతిపక్ష ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. చైర్మన్ ధన్కడ్ సభలో బీజేపీ తొత్తులా వ్యవహరిస్తున్నాడని.. ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా పక్షపాతం చూపిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. ఈ క్రమంలో రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్కడ్పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేంద్రమంత్రి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రియాక్ట్ అయ్యారు.
మంగళవారం (డిసెంబర్ 10) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్య సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉందని.. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని అన్నారు. చైర్మన్ ధన్కడ్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును నోటీసును తప్పనిసరిగా తిరస్కరిస్తామని స్పష్టం చేశారు.
ఇలాంటి చర్యలను ఆమోదించకుండా చూస్తామన్నారు. కాగా, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని రాజ్య సభ చైర్మన్ ధన్కడ్పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశాస్వ తీర్మానం పాస్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే పెద్దల సభలో ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమికే మెజార్టీ ఉంది. దీంతో ఈ తీర్మానం వీగిపోతుంది. ఇదే కాకుండా టెక్నికల్‌గా కూడా ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు.
భారత రాజ్యాంగం ప్రకారం రాజ్య సభ చైర్మన్‌ను తొలగించేందుకు ప్రవేశ పెట్టే అవిశ్వాస తీర్మానం నోటీసుల 14 రోజుల ముందు ఇవ్వాలి. అయితే.. ప్రస్తుతం జరుగుతోన్న శీతాకాల సమావేశాలు మరో 10 రోజుల్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు తీసుకొచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ తీర్మానం ఆమోదం పొందే చాన్స్ లేదు. కేవలం ఇది పొలిటికల్ స్టంట్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యసభ ఛైర్మన్‌ను తొలగించే ప్రాసెస్ ఏంటి..?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (బి) ప్రకారం రాజ్య సభ చైర్మన్‌ను తొలగించే హక్కు ఉంది. ఛైర్మన్‌ను తొలగించాలంటే 50 మంది ఎంపీల సంతకాలతో నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం 14 రోజుల ముందు ఈ నోటీసు ఇవ్వాలి. అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఆమోదం పొందాలంటే ముందుగా రాజ్యసభలో సాధారణ మెజారిటీ లభించాలి.
రాజ్యసభ అనంతరం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు లోక్‌సభ కూడా ఆమోదించాలి. ఉభయ సభల్లో మెజార్టీ రాకపోతే చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం విగిపోతోంది. ఒక వేళ అవిశాస్వ తీర్మానం సభ ఆమోదం పొందితే.. చైర్మన్ పదవి నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పార్లమెంట్లో ఉభయ సభల్లో విపక్షాలకు మెజార్టీ లేకపోవడంతో రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్కడ్పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు.