ప్రజలు ఎవరి దగ్గరైనా కరెంటు కొనొచ్చు

ప్రజలు ఎవరి దగ్గరైనా కరెంటు కొనొచ్చు
  • టెలికామ్‌ లెక్కనే విద్యుత్​ రంగం: కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌
  • రాష్ట్రాల ఎనర్జీ సెక్రటరీలు, సీఎండీలతో వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌‌, వెలుగు: టెలికామ్‌‌ రంగంలో మాదిరే కరెంటు రంగంలో పోటీ పెరిగితే ప్రజలకు తక్కువ ధరకు కరెంటు అందుతుందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్‌‌ అన్నారు. బుధవారం ఆయన విద్యుత్‌‌ సంస్కరణల ముసాయిదా సవరణపై అన్ని రాష్ట్రాల ఎనర్జీ సెక్రటరీలు, సీఎండీలతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. ‘విద్యుత్​రంగంలో తీసుకొస్తున్న ఈ రిఫార్మ్స్ లో డిస్కమ్​లు కూడా కొనసాగుతాయి. అయితే వాటికి పోటీగా ప్రైవేటు ఆపరేటర్లు వస్తారు. ప్రైవేటు ఆపరేటర్లు ఎక్కడైనా కరెంటు కొనొచ్చు. ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ప్రజలు కూడా ఇష్టమొచ్చిన ఆపరేటర్‌‌ దగ్గర కరెంటు కొనుక్కోవచ్చు. ప్రజలకుండే ఈ సౌలత్​ను రాష్ట్రాలు కంట్రోల్ చేయొద్దు” అని కోరారు. డిస్కమ్‌‌ల పరిధిలో బిల్లింగ్‌‌, మీటర్‌‌ రీడింగ్‌‌ ప్రస్తుతం ప్రైవేటు (ఔట్‌‌సోర్సింగ్‌‌) వ్యక్తులే చేస్తున్నారన్నారు. అలాంటప్పుడు డిస్కమ్‌‌లకు కొత్తగా వచ్చే నష్టమేమీ ఉండదన్నారు. డిస్కమ్‌‌ లు.. ప్రైవేటు ఆపరేటర్లతో  పోటీపడి వినియోగదారులకు కరెంటు అందించొచ్చని తెలిపారు. ప్రైవేటు ఆపరేటర్లు కూడా డిస్కమ్‌‌ లైన్లనే వాడుకొని.. అందుకు వీలింగ్‌‌ చార్జీలు చెల్లిస్తాయని వివరించారు. ప్రస్తుతం టెలికామ్‌‌ రంగంలో పోటీ పెరగడంతో తక్కువ ధరలకే మొబైల్‌‌ సేవలు అందుతున్నాయని, అంతే కాకుండా టెలికాం రంగంలో నాలుగు రెట్లు ఉద్యోగాలు పెరిగాయన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌‌ రంగంలోనూ ఇదే తరహాలో ఉద్యోగాలు, క్వాలిటీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.

డిస్కమ్‌‌ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తం: రాష్ట్రం

డిస్కమ్‌‌లను ప్రైవేటుకివ్వడంలో భాగమైన ఫ్రాంచైజీ విధానాన్ని అమలుపరచడం వీలుకాదని రాష్ట్రం తెలిపింది. విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్‌‌లో తీర్మానం చేసిందని, దానికే కట్టుబడి ఉందని వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర అధికారులు చెప్పారు. ఆర్పీవోపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర సర్కార్​కే ఉంచాలన్నారు. విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాసేలా ఉందని, రైతులు, పేద వర్గాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్‌‌లో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ  ప్రభాకర్ రావు, సి.శ్రీనివాసరావు, జి.రఘుమారెడ్డి, ఎ.గోపాలరావులు పాల్గొన్నారు.

సవరణ బిల్లుపై ప్రధానికి సీఎం లేఖ..

కాన్ఫరెన్స్‌‌కు ముందు విద్యుత్ చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్ లెటర్ రాశారు. బిల్లులోని అంశాలు వినియోగదారులు, రాష్ట్ర విద్యుత్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలు కాపాడేలా లేవని అందులో పేర్కొన్నారు. ఓపెన్​ మార్కెట్​లో కరెంటు కొనే స్వేచ్ఛనివ్వాలని ప్రతిపాదించారని.. ఈ నిర్ణయం డిస్కమ్‌లపై ఆర్థికంగా భారంగా మారుతుందన్నారు. అలాగే క్రాస్ సబ్సిడీని ఇచ్చే అంశంతో పాటు సబ్సిడీ ఎలా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్రాల నియంత్రణ మండళ్ల నియామకం విషయంలో రాష్ట్ర అధికారాలను హరించే విధంగా బిల్లు ఉందన్నారు.

For More News..

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..

సాఫ్ట్​వేర్ కంపెనీలు మార్చిలో రీ ఓపెన్