కరీంనగర్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం (జవనరి 10) ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే ఆందోళనలు ఎందుకు చేయాలి..? కేటీఆర్ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధుడా అని ప్రశ్నించారు. సర్కార్ సొమ్మును అక్రమంగా కట్టబెట్టి పైగా అడ్డగోలుగా మాట్లాడతవా అని కేటీఆర్‌పై సీరియస్ అయ్యారు.
కేబినెట్ ఆమోదం లేకుండా విదేశీ కంపెనీకి అంత అర్జెంట్‌గా కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఫార్ములా ఈ రేస్ తో ప్రభుత్వానికి రూ.700 కోట్లు లాభం వచ్చిందని కేటీఆర్ అంటున్నారు.. మరీ ఆ లాభాలు ఎక్కడ వచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు. లొట్టపీసు సీఎం, లొట్ట పీసు ప్రభుత్వం అని కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు..? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
రేవంత్‌ను అడ్డగోలుగా తిడుతున్నా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటి..? ఢిల్లీ వెళ్లి కేసీఆర్ కాంగ్రెస్ హై కమాండ్‌కు కప్పం కడుతున్నందుకే రేవంత్ ఏం చేయలేకపోతున్నారా..? అని నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలపై, కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీ రాజీలేని పోరు కొనసాగిస్తోందని ఈ సందర్భంగా బండి సంజయ్ స్పష్టం చేశారు.