హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో సీఎం రేవంత్ రెడ్డిసమాధానం చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్‌తో ఆయనకు ఉన్న బంధం ఏంటో చెప్పాలని అన్నారు. ‘ఒకనాడు జన్వాడ ఫాంహౌస్‌పై డ్రోన్ ఎగిరేశారనే కారణంతో నీ బిడ్డ పెండ్లిని కూడా చూడనీయకుండా నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన్రు. అట్లాంటిది ఇవాళ బయటపడుతున్న స్కాములన్నింట్లో కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ముద్దాయిలని తేలిన తరువాత కూడా ఎందుకు జైల్లో పెడతలేవ్..’ అని సీఎం రేవంత్ రెడ్డిని సంజయ్ ప్రశ్నించారు.
కేటీఆర్ తో రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని.. అందుకే ఫార్ములా ఈ-– రేస్, రేవ్ పార్టీ, డ్రగ్స్, కాళేశ్వరం సహా పలు స్కాముల్లో కేటీఆర్ ప్రధాన నిందితుడని తేలినా అరెస్ట్ చేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే.. కేటీఆర్ యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌కు కార్యకర్తలకంటే కుటుంబమే ముఖ్యం..
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తాను, రేవంత్ రెడ్డి పోరాటం చేశామని సంజయ్అన్నారు. తామిద్దరం ఫైటర్స్ అని, అందుకే కేటీఆర్‌కు నిద్రలో కూడా గుర్తువస్తామని తెలిపారు. ‘‘రేవంత్ రెడ్డి కేటీఆర్‌తో కలిసిపోయిండు. పగలు ఇద్దరూ ఫైట్ చేసుకుంటున్నట్టు నటిస్తరు. రాత్రి ఒక్కటైతున్నరు. కేటీఆర్ పెద్ద బ్లాక్ మెయిలర్. గత ప్రభుత్వంలో అవినీతిపరుడు’’ అని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులైతే ఏనాడూ పోలీసులకు ఫోన్ చేయని కేసీఆర్.. కేటీఆర్ బామ్మర్ది కేసు గురించి మాత్రం ఏకంగా డీజీపీకి ఫోన్ చేశారని చెప్పారు.
దీన్ని బట్టి కేసీఆర్‌కు కార్యకర్తలకంటే కుటుంబమే ముఖ్యమని తేలిందన్నారు. ప్రజాసమస్యలను, కార్యకర్తల కష్టాలను గాలికొదిలేసి హాయిగా ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పనైపోయిందని.. దాని గురించి ఆలోచించే కార్యకర్తలే కరువయ్యారని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో పక్కచూపులు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాల్సింది సంగెం వద్ద కాదని, మూసీ పునరుజ్జీవంతో ఇండ్లు కోల్పోతున్న బాధిత ప్రాంతాల్లో తిరిగాలని బండి సంజయ్ సూచించారు.