
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం (ఫిబ్రవరి 22) భోపాల్ నుంచి ఢిల్లీకి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానంలో ఆయనకు కేటాయించిన సీటు విరిగిపోయింది. ఈ ఘటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చొన్న వెంటనే సీటు విరిగిందని.. ఎయిర్ లైన్స్ సిబ్బంది తీరుతో చాలా అసౌకర్యం కలిగిందని ఫైర్ అయ్యారు. ఇరిగిన సీటు ఎందుకు కేటాంచారని సిబ్బందిని పశ్నిస్తే.. ఈ సీటు ఉపయోగించడానికి పనికిరానిదని మరియు అమ్మకూడదని యాజమాన్యానికి ఇప్పటికే సమాచారం అందిందని వారు నాకు చెప్పారన్నారు.
ALSO READ | మంత్రుల వ్యాఖ్యలతో బెంగళూరు ప్రజల్లో మొదలైన టెన్షన్.. ఆ విషయంలో హైదరాబాద్ సేఫేనా..?
ఈ సమస్య నాకు ఒక్కడికే కాదని.. విమానంలో విరిగిన సీట్లు ఇంకా చాలా ఉన్నాయని.. వేలకు వేలు టికెట్ రేట్లు వసూల్ చేస్తూ ఇలా విరిగిన సీట్లు కేటాయించడమేంటని ఎయిర్ లైన్స్ సిబ్బందిపై శివాలెత్తారు. వేరే ప్రయాణికుడి నాకు సీటు ఇచ్చేందుకు ముందుగా రాగా.. నా వల్ల అతడు ఇబ్బంది పడటం ఎందుకని విరిగిన సీటులోనే కూర్చొని ప్రయాణం చేశానని తెలిపారు శివరాజ్ సింగ్ చౌహాన్. టాటా గ్రూప్ చేతికి వెళ్లాక నిర్వహణలో ఎయిర్ ఇండియా సేవలు మెరుగుపడ్డాయని తాను భావించానని, కానీ ఎయిర్ ఇండియాసేవలు ఇంకా పేలవంగానే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు.
విరిగిన సీట్లను అందిస్తూ ఎయిర్‌లైన్స్ పూర్తి ఛార్జీలు వసూలు చేయడం అనైతికమని.. ఈ చర్య ప్రయాణీకులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆయన ఎయిర్ ఇండియాకు చురకలంటించారు. ఈ ఘటనపై వెంటనే ఎయిర్ ఇండియా స్పందించి.. మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటామని పేర్కొంది.