నేనూ రైతు బిడ్డనే.. వాళ్ల కష్టాలు నాకు బాగా తెలుసు: శివరాజ్ సింగ్ చౌహాన్

ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం తరుఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని.. వరదల్లో నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు అల్లకల్లోలమైన ఖమ్మం జిల్లాను కేంద్ర మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి శుక్రవారం శివరాజ్ సింగ్ పరిశీలించారు. ఏరియల్ సర్వే దారా వరదల వల్ల నాశనమైన పంట పొలాలను, నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేను రాజకీయాలు చేసేందుకు రాలేదని.. రైతులను ఆదుకునేందుకే ఇక్కడికి వచ్చానని అన్నారు. నేను కూడా రైతునేనని.. రైతులకు కష్టాలు నాకు బాగా తెలుసన్నారు. 

ఏరియల్ సర్వేతో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించానని.. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. పశువులు, ఇతర మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. బాధితుల ఇళ్లలో సామాగ్రి కొట్టుకుపోయాయని బాధపడ్డారు. విపత్తుల సమయంలో రాజకీయాలు వద్దని.. కేంద్ర వరద బాధితులను ఆదుకుంటుందని భరోసా కల్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను డైవర్ట్ చేసిందని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశార శివరాజ్ సింగ్ చౌహాన్.