ఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన తండ్రి, ప్రధాని మోదీతో కలిసి తీయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్మృతి ఇరానీ సాధారణంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తాజాగా ఆమె తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా.. ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి భేటీని ఆమె పేరెంట్-టీచర్ మీటింగ్ తో పోల్చారు.
‘మన బాస్, మన తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చున్నారంటే కంగారొచ్చేస్తుంది. వారిద్దరూ కలిసి మనపై పోటీ పడి ఫిర్యాదులు చెప్పకూడదని ప్రార్థించుకోవాలి. పేరెంట్స్-టీచర్ మీటింగ్ జరుగుతోంది’ అని ఇరానీ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. బిజీ షెడ్యూల్‌లో కూడా తమకు సమయం కేటాయించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు.