‘మీడియాకు మేత దొరికింది’.. రిపోర్టర్లపై కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఫైర్

‘మీడియాకు మేత దొరికింది’.. రిపోర్టర్లపై కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఫైర్

త్రిస్సూర్: సినిమా ఇండస్ట్రీపై ప్రజలకు విముఖత కల్పించేలా మీడియా చూపిస్తోందని నటుడు, కేంద్ర సహాయ మంత్రి సురేశ్​గోపి మంగళవారం ఆరోపించారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు రూపంలో మీడియాకు మేత దొరికిందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న నటులు, దర్శకులు, నిర్మాతలకు సంబంధించిన వార్తలతో లాభాలు మూటగట్టుకునే ప్రయత్నం చేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. ఎంతోమందికి తిండి పెడుతున్న సినీ పరిశ్రమను నాశనం చేయొద్దంటూ రిపోర్టర్లకు విజ్ఞప్తి చేశారు. సినీ యాక్టర్, సీపీఎం ఎమ్మెల్యే ముకేశ్​మాధవన్‎పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 

జస్టిస్ హేమ కమిటీ రిపోర్టులో పలువురు దర్శకులు, నిర్మాతల పేర్లు బయటకొచ్చాయి. గతంలో జరిగిన సంఘటనలు, వేధింపులను ఇండస్ట్రీకి చెందిన పలువురు మహిళలు తాజాగా బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముకేశ్​ మాధవన్ పైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముకేశ్, సురేశ్​ గోపీ చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు. ఈ క్రమంలోనే మంగళవారం త్రిస్సూర్‎లో సురేశ్​గోపీని మీడియా పలకరించింది. ముకేశ్​మాధవన్ పై వచ్చిన ఆరోపణల విషయంలో స్పందించాలని కోరగా.. కేంద్రమంత్రి ఆగ్రహానికి గురయ్యారు.

 తన ముందున్న మీడియా ప్రతినిధులను తోసుకుంటూ వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. న్యాయస్థానం దోషిగా తేల్చే వరకూ ముకేశ్​నిర్దోషేనని సురేశ్​గోపి స్పష్టం చేశారు. కాగా, లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై నిష్పాక్షికంగా విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని నటుడు పృథ్విరాజ్​ సుకుమారన్ డిమాండ్​ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే నిందితులను, తప్పని తేలితే ఆరోపణలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

‘అమ్మ’ కమిటీ రాజీనామా

మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులకు సంబంధించి పలువురు ప్రముఖులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ‘అసోసియేషన్ ఆఫ్​మలయాళం మూవీ ఆర్టిస్ట్స్​(అమ్మ) ప్రెసిడెంట్​పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. అమ్మ కమిటీ జనరల్ సెక్రెటరీగా కొనసాగుతున్న సిద్ధిఖిపైనా ఆరోపణలు రావడం, ఆయన తన పదవికి రిజైన్​చేయడం తెలిసిందే. దీనిపై నైతికంగా స్పందిస్తూ మోహన్ లాల్​తప్పుకున్నా డు. మోహన్ లాల్‎కు మద్దతుగా మొత్తం కమిటీ సభ్యులు 17 మంది రాజీనామా చేశారు. దీంతో ‘అమ్మ’ పాలకవర్గం మొత్తం కొలాప్స్ అయింది. మరో రెండు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరిపి కొత్త మెంబర్లను ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం.