
- పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 110 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు కేంద్రం వెల్లడించింది. అందులో పెద్దపల్లిలో 3, వరంగల్‌లో 4, ఖమ్మంలో 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రాంనాథ్ ఠాకూర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్ (2024–25)లో 210.19 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ సేకరించిందని తెలిపారు. ఈ కొనుగోళ్లతో దాదాపు 9 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందినట్టు వెల్లడించారు. అలాగే, పత్తి రైతులను ఇబ్బందుల నుంచి కాపాడడానికి, ఎంఎస్పీకే పత్తి సేకరణ చేపట్టడానికి సీసీఐని నోడల్ ఏజెన్సీగా నియమించినట్టు తెలిపారు. దీంతో పాటు పత్తి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి జాతీయ ఆహార భద్రత – పోషకాహార మిషన్ కింద పత్తి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సమాధానంలో స్పష్టం చేశారు.