తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ లేట్​ : వెదిరె శ్రీరామ్

తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే  ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ లేట్​ : వెదిరె శ్రీరామ్
  • కాళేశ్వరం బ్యారేజీలకు జియోటెక్నికల్ ​టెస్టులు చేయకుండానే గ్రౌటింగ్:వెదిరె శ్రీరామ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) రిపోర్ట్​ లేట్​ అవుతున్నదని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్​ అన్నారు. జియోటెక్నికల్​ టెస్టులు పూర్తి చేయాలని ఎన్​డీఎస్​ఏ ఆదేశించినా.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని చేయలేదని చెప్పారు. టెస్టులను చేయకపోగా.. బ్యారేజీ అప్​స్ట్రీమ్​, డౌన్​స్ట్రీమ్​లలో పడిన బుంగలను కాంక్రీట్​ మిక్చర్​తో గ్రౌటింగ్​ చేశారని అన్నారు. ఫలితంగా బ్యారేజీ కుంగినప్పుడున్న గ్రౌండ్​ స్ట్రాటా తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

ఇప్పుడు జియోటెక్నికల్​ టెస్టులు చేసినా ప్రయోజనం లేదని, అప్పుడున్న నేల పరిస్థితులు తెలియవని పేర్కొన్నారు. బుధవారం ఆయన బీఆర్​కే భవన్​లో కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్​తో సమావేశమయ్యారు. జులైలో సమర్పించిన డిపొజిషన్​ను అఫిడవిట్​ రూపంలో సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ లేట్​ అవుతుండడంపై కమిషన్​ చైర్మన్​ ప్రశ్నించారని శ్రీరామ్​ తెలిపారు. ఇరిగేషన్​ అధికారులు వాళ్లంతట వాళ్లే ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని బుంగలను పూడ్చారన్నారు. 

గ్రౌటింగ్​ చేయడంతో జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​లో తేలాల్సిన ఇన్ఫర్మేషన్​ మొత్తం పోయిందన్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్​డీఎస్​ఏ అధికారులు లేఖ రాశారన్నారు. ఇప్పటివరకు బ్యారేజీల వద్ద చేసిన పనులు, రిపేర్లు, టెస్టుల వివరాలను ఇవ్వాల్సిందిగా లేఖలో కోరారని చెప్పారు. ఎప్పుడెప్పుడు ఏం చేశారో చెప్పాల్సిందిగా కోరారని, దాని వల్ల ఏ డేటాను కోల్పోవాల్సి వచ్చిందో ఓ నిర్ధారణకు వస్తామని లేఖలో వివరించారని చెప్పారు. దాని ప్రకారం మిగతా డేటాకు సంబంధించి చేయాల్సిన టెస్టుల గురించి చెబుతామంటూ సిఫార్సు చేశారన్నారు.