
- చెట్లు, వన్యప్రాణులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- చట్టం, కోర్టు తీర్పులకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి
- స్టేట్ ఫారెస్ట్ అడిషనల్ సెక్రటరీకి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ లేఖ
హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే నిజ నిర్ధారణ నివేదిక పంపాలని రాష్ట్ర అటవీ శాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కోరింది. ఈ మేరకు స్టేట్ ఫారెస్ట్ అడిషనల్ సెక్రటరీకి లేఖ రాసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఉన్న కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించింది. వాస్తవ పరిస్థితులతో నివేదిక పంపడంతో పాటు అటవీ చట్టానికి లోబడి తీసుకుంటున్న చర్యలతో తమకు నివేదిక పంపాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలో దాదాపు 400 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా క్లియర్ చేసి, చెట్లను నరికేస్తున్నారని, దీని వల్ల అరుదైన చెట్లు, సరస్సులు, ప్రత్యేకమైన రాళ్ల నిర్మాణాలు దెబ్బతింటున్నాయని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు వచ్చిందని పేర్కొంది.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐసీ) ఆక్రమణలకు పాల్పడుతోందని అందులో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆ భూముల్లోని చెట్లు, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖకు సూచించింది. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పులు, చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలని స్పష్టం చేసింది. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి.నగేశ్, రఘునందన్ రావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
ఆ 400 ఎకరాలు పర్యావరణ, హెరిటేజ్ భూములని తెలిపారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు ఈ భూములు ఎంతో అవసరమని చెప్పారు. ఇంతటి విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. వెంటనే కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకొని ఆ భూములను పరిరక్షించాలని కోరారు. అయితే ఆ మరుసటి రోజే రాష్ట్ర అటవీశాఖకు ఆదేశాలు రావడం గమనార్హం.