సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించండి

నస్పూర్, వెలుగు: సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలని ఆ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోరారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గనిపై జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగి, కార్మిక వర్గ హక్కులు, సౌకర్యాలే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్​ను కార్మికులు ఆదరించి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సింగరేణిలోని మిగతా జాతీయ, ప్రాంతీయ సంఘాలు బలమైన కార్మిక ఉద్యమాలను నిర్మించలేవని.. ఇలాంటి సంఘాల మాటలు సింగరేణి ఉద్యోగులు నమ్మొద్దన్నారు. కార్మికుల ఐక్యతను విడగొట్టే పాలకవర్గ ట్రేడ్ యూనియన్లు, పైరవీకారి ట్రేడ్ యూనియన్లను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్కె సమ్మయ్య, షేక్ బాజీ సైదా, కొట్లె కిషన్ రావు, మారేపల్లి బాపు, గొర్రె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.