యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా

యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా
  • 15 రోజుల క్రితమే లేఖ సమర్పించిన మనోజ్ సోని

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేశారు. మరో ఐదేళ్ల పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన రాజీనామా లేఖ విషయం శనివారం బయటకు వచ్చింది. 

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో యూపీఎస్సీపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో పాటు మరికొంతమంది సివిల్ సర్వెంట్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో మనోజ్ సోని రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజా వివాదాలకు సోని రాజీనామాకు సంబంధంలేదని, 15 రోజుల క్రితమే ఆయన రాజీనామా లేఖ సమర్పించారని అధికార వర్గాలు తెలిపాయి. 

సోని రాజీనామా విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించాయి.