ఖమ్మం మధ్య గేటు వద్ద అండర్ పాస్ ఏర్పాటుకు రైల్వే మంత్రి హామీ

ఖమ్మం మధ్య గేటు వద్ద అండర్ పాస్ ఏర్పాటుకు రైల్వే మంత్రి హామీ

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలోని రైల్వే మధ్య గేటు సమస్యకు శాశ్వత పరిష్కారానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి హామీ లభించింది. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సోమవారం పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. మధ్య గేటు ప్రాధాన్యత, వ్యాపార, వాణిజ్య సంబంధాలు, రెండు పట్టణ ప్రాంతాల కలయిక తదితర అంశాలపై ఆయన రైల్వే మంత్రికి వివరించారు. ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి కి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మధ్య గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను  పరిశీలించాలని రైల్వే ఉన్నతాధికారులకు సూచించారు. రైల్వే మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.

అంతకు ముందు రైల్వే శాఖపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ రవిచంద్ర మధ్య గేటు సమస్యను ప్రస్తావించారు. కమాన్ బజార్, గాంధీ చౌక్ ప్రాంతాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలకు ప్రధాన మార్గమైన ఈ గేటు గడిచిన నాలుగు నెలలుగా మూసి ఉంచడం వల్ల వ్యాపార లావాదేవీలు స్థంభించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడో ప్లాట్ ఫాం విస్తరణ పనులు వేగం పెంచి, తక్షణమే మధ్య గేటును వినియోగంలోకి తేవాలని కోరారు. 

రాముడి పేరుతో రాజకీయం చేస్తారు..  కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరా?

రాముడి పేరుతో రాజకీయం చేసే ఎన్డీఏ ప్రభుత్వం, అదే రాముడు నడయాడిన భద్రాచల క్షేత్రంతో పాటు, తెలంగాణలోని రైల్వే సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. సోమవారం రాజ్యసభలో బడ్జెట్​లో రైల్వే శాఖకు కేటాయించిన నిధులపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన తెలంగాణకు సంబంధించిన పలు రైల్వే సమస్యలను ప్రస్తావించారు.

‘రఘుపతి రాఘవ రాజారామ్’ అనే రాముడి కావ్యంతో చర్చను ప్రారంభించిన ఆయన దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలం క్షేత్రానికి రైలు మార్గం అనుసంధానించే భద్రాచలం - కొవ్వూరు రైల్వే లైన్ దశాబ్దాల నుంచి కలగా ఉంటోందని, ఈ కల సాకారం కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చెప్పారు. రైల్వే ఆదాయానికి అధిక శాతం నిధులు సమకూరుస్తున్నా, తెలంగాణ లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదని వాపోయారు. దక్షిణ మధ్య రైల్వేకు 48 శాతం ఆదాయం సమకూరుస్తున్న ఖాజీపేటను ప్రత్యేక డివిజన్ గా గుర్తిస్తే లాభదాయకంగా ఉంటుందని ప్రస్తావించారు.