హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న కరీంనగర్, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తున్నట్టు కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో సీపీఎస్ ఈయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. పాత పింఛన్ సాధన ఉద్యమంలో ముందుంటూ, మచ్చలేని చరిత్ర ఉన్న వారినే అభ్యర్థులుగా బరిలో దింపుతున్నట్టు స్థితప్రజ్ఞ ప్రకటించారు.
సీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పింఛన్ స్కీమ్ తీసుకురావాలనే అంశంపై ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండంగా నిలుస్తాయని చెప్పారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎస్ టీచర్లు, ఉద్యోగుల ఓట్లు కీలకంగా ఉంటాయని తెలిపారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ సెగ్మెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ కొలిపాక వెంకటస్వామిని ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, స్టేట్ ట్రెజరర్ నరేశ్ గౌడ్, రాష్ట్ర నాయకులు మ్యాన పవన్, లింగమూర్తి, పోల శ్రీనివాస్, కిరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.