
- హోలీ సందర్భంగా మెదక్ జిల్లా కొంతాన్‌పల్లిలో వింత ఆచారం
శివ్వంపేట, వెలుగు : హోలీ అంటే సాధారణంగా రంగులు చల్లుకుంటారు. కానీ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లిలో మాత్రం ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో దాడి చేసుకుంటారు. ఈ వింత ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతోంది. గురువారం కూడా గ్రామస్తులంతా ఉదయం రంగులు చల్లుకొని, సాయంత్రం హనుమాన్ ఆలయం వద్ద పిడిగుద్దులాట నిర్వహించారు. ముందుగా గ్రామ పెద్దమనిషి అయిన పోలీస్ పటేల్ చింతల కృష్ణారెడ్డితో పాటు పలు కులవృత్తులవారు గ్రామ పంచాయతీ వద్ద పూజలు చేశారు.
అనంతరం డప్పుచప్పుళ్లతో గ్రామంలోని పెద్ద గౌడ ఇంటికి వెళ్లి కల్లు ఘటాన్ని తీసుకొచ్చి హనుమాన్ ఆలయం ముందు పెట్టారు. ఆ తర్వాత ఎస్సీ కాలనీలోని ఎల్లమ్మ లంద నుంచి ఓ తాడును ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకొచ్చి పూజలు చేశారు. తర్వాత కులవృత్తుల వారు రెండు గ్రూపులుగా విడిపోయి, తాడును చెరో వైపు పట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దెబ్బలు తగులుతున్నా, రక్తం కారుతున్నా లెక్క చేయకుండా సుమారు రెండు గంటల పాటు ఆట సాగింది.
ఈ ఆటను చూసేందుకు శివ్వంపేట, తూప్రాన్, నర్సాపూర్, వెల్దుర్తి మండల పరిధిలోని గ్రామాలతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కరుణాకర్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్ వెంకటరాంరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శివ, నాయకులు జగన్‌రెడ్డి, సంతోష్, శ్రీనివాస్, శంకర్, దేవలింగం పాల్గొన్నారు.