గుజరాత్​, హిమాచల్​ రాష్ట్రాల్లో విలక్షణ తీర్పు : మల్లంపల్లి ధూర్జటి

గుజరాత్​లో అసాధారణమైన రీతిలో శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం ద్వారా బీజేపీ.. పశ్చిమ బెంగాల్​లో వామపక్ష కూటమి వరుసగా ఏడు ఎన్నికల్లో గెలిచి నెలకొల్పిన రికార్డును సమం చేసింది. గుజరాత్​లో మొత్తం 182 సీట్లలో 156 సీట్లను కైవసం చేసుకుని  బీజేపీ సాధించిన విజయం అపూర్వమైనదని దాని ప్రత్యర్థులు కూడా అంగీకరించి తీరాలి.  సైద్ధాంతిక, సంస్థాగత బలం, పాటీదార్లతో సయోధ్య, అభివృద్ధి, నూతన సామాజిక ఐక్యత, భిన్నమైన పార్టీ కావడం, పనిచేయని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా పక్కనపెట్టడం బీజేపీ విజయానికి దోహదపడిన అంశాలు. సుమారుగా 20 మంది పేర్లు ఉండే ఓటర్ల జాబితాలోని ఒక్కొక్క పేజీని ఒక్కొక్క కార్యకర్తకు కేటాయించి, ఆ ఇరవై కుటుంబాలను కలిసి, బీజేపీకి ఓటు వేయవలసిన అవసరంపై కనీసం ఒక కుటుంబ సభ్యునికైనా నచ్చజెప్పే బాధ్యతను అప్పగించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఇవి ‘పేజీ కమిటీలు’ లుగా ప్రచారం పొందాయి. 

గుజరాత్​లో బీజేపీ రికార్డు గెలుపు వెనకాల..

 బి.జె.పి గణనీయమైన రీతిలో నూతన ఓటర్లను కూడగట్టుకోవడం ద్వారా 50 శాతం పైగా ఓట్ల శాతం సాధించింది. కాంగ్రెస్ కు సంప్రదాయంగా బలమైన ప్రాంతాలుగా చెప్పుకునే గిరిజన ప్రాంతాలు, సౌరాష్ట్ర గ్రామీణ ప్రాంతాలు, ఉత్తర గుజరాత్ లో కూడా ఆ పార్టీని బీజేపీ మట్టి కరిపించింది. గత కొద్ది దశాబ్దాల్లో ఎన్నడూ గెలవని సీట్లలో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఓటింగ్ తీరులో వచ్చిన మార్పును ధ్రువపరుస్తోంది. దీనిని పాత కొలబద్దలతో విశ్లేషించడానికి లేదు. హిందుత్వ సిద్ధాంతం, మతపరమైన అస్తిత్వం, నాయకుల జనాకర్షక శక్తి, అభివృద్ధిపై అంచనాలు, పార్టీల తీరుతెన్నులు, జాతీయ భద్రతపై శ్రద్ధాసక్తులతో సహా కొన్నిపరస్పర సంబంధిత అంశాలు, స్వతంత్ర అంశాలు కలగలసి ఈ ఫలితాన్ని చేకూర్చినట్లు కనిపిస్తోంది.  కాంగ్రెస్ దారి తెన్నూ లేని స్థితిలో పడిపోవడం, రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేకపోవడం కూడా బీజేపీకి పరోక్షంగా దోహదపడింది. 

పనిచేయని ఉచితాలు

ఉచితాల మాయలో పడడానికి ఓటర్లు సిద్ధంగా లేరని తేలిపోయింది. బీజేపీ కూడా కొన్ని ఉచిత పథకాల హామీలిచ్చినా ఓటర్లు ప్రధానంగా సాంస్కృతిక జాతీయవాదం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే దానికి పట్టం కట్టారు. నరేంద్ర మోడీ సుడిగాలి ప్రచారం, మేరునగధీర వ్యక్తిత్వం బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చు.  మోదీ 2017లో కూడా ఎంతో శ్రమించి ప్రచారం చేశారు. కానీ, బీజేపీ బలం ఆ ఎన్నికల్లో 99 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కనుక, రాష్ట్రంలో సుస్థిరతకు, ఆర్థిక, పారిశ్రామిక విధానాల కొనసాగింపునకు ఓటర్లు మొగ్గు చూపారనుకోవాలి. బీజేపీ పాలన, చురుకైన నాయకత్వం ప్రజలకు దాన్ని దగ్గరజేశాయి. వ్యాపార దృక్పథం కలిగిన గుజరాతీయులు భారీ డిస్కౌంట్లతో ఇవ్వజూపిన కానుకలు, కొత్త ఉత్పత్తుల జోలికిపోయే బదులు మన్నికైన పాత వస్తువులను వినియోగించుకోవడమే మంచిదనుకున్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోయినా బీజేపీ మునుపటిలాగానే బాధ్యతాయుతమైన పాలనను అందించాలి. రానున్న 2024 సాధారణ ఎన్నికల్లో బి.జె.పికి ఇదే రకమైన విజయం తెచ్చిపెట్టాల్సిన గురుతరమైన బాధ్యత  భూపేంద్ర పటేల్ భుజస్కంధాలపై ఉంది. 

 కాంగ్రెస్​ను హామీలే గెలిపించాయా?

పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానం ప్రజలను ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ధరల పెరుగుదల అంశం ప్రభావం చూపింది. ప్రజల్లోని ముఖ్యమైన వర్గాలు సంతోషంగా లేకపోవడం కూడా బీజేపీని దెబ్బతీసింది. కాంగ్రెస్ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలోనే హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. చాలా కాలంపాటు హిమాచల్ లో జనాలకు ప్రభుత్వ ఉద్యోగాలే కానీ, పరిశ్రమలు కానీ, ఇతర ఉపాధి అవకాశాలు కానీ లేవు. ఫలితంగా ప్రభుత్వోద్యోగులు బలమైన వర్గంగా రూపొందారు. ఇప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు 2 లక్షల పైచిలుకు ఉన్నారు. వారు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఆ పని చేస్తామని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు హామీ ఇచ్చాయి. కానీ, గుజరాత్ పై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ ఆప్ హిమాచల్ లో ప్రచారాన్ని ఒక రకంగా మధ్యలోనే విరమించుకుంది. ఆర్థిక పర్యవసానాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ ఆ రకమైన సంకేతాలు ఇవ్వలేకపోయింది. బీజేపీ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ కి వ్యక్తిగతంగా  నిష్కళంకునిగా, ముక్కుసూటి మనిషిగా పేరుంది. కానీ, ఆయన చుట్టూ కొందరు వంచనపరులు చేరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. గత ఐదేళ్ళలో రాష్ట్రం ఏడుగురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను చూసింది. పోలీసు నియామకాల్లో కుంభకోణం, అరి నగర్ పంచాయత్ నోటిఫికేషన్ వంటి ఆదరాబాదరాగా తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయి. సిమ్లా అభివృద్ధి ప్రణాళిక ముసాయిదాను కూడా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా, సీఎం డమ్మీయేననే ముద్ర పడింది. గుజరాత్​కు చెందిన అదానీ గ్రూప్ తనకు తక్కువ ధరలు ఇవ్వజూపుతోందంటూ ఎగువ హిమాచల్​లో ప్రాబల్యం ఉన్న యాపిల్ లాబీ కినుకతో ఉంది. కార్టన్లపై  సేవల పన్ను  యాపిల్ తోటల యజమానుల లాభాలను మరింత కుచించి వేసింది. యాపిల్ తోటల పెంపకం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందేమోననే భయం ప్రజలను బీజేపీ పట్ల విముఖులను చేసింది. సైన్యంలో నాలుగేళ్ల పాటు మాత్రమే కొలువు ఉండే అగ్నిపథ్ పథకం పట్ల యువతకున్న అసంతృప్తి కూడా కాంగ్రెస్​కు కలసి వచ్చింది. మండి లోక్ సభ స్థానంతో సహా మూడు అసెంబ్లీ సీట్లకు 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పుడే చూచాయగా ప్రజల మనోరథం బయటపడింది.  మొత్తంమీద, ఈ ఎన్నికల ఫలితాలు ఓటర్ల విజ్ఞతను వెల్లడించాయి. -

హిమాచల్​లో కాంగ్రెస్​ గెలుపు వెనుక..

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం వెనుక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ కు ఆరు విడతలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య. మండి నియోజకవర్గం నుంచి ఆమె లోక్ సభ సభ్యురాలిగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో విజయం ద్వారా కాంగ్రెస్ పరువును కొంతైనా కాపాడుకుంది. బీజేపీకి హిమాచల్ కూడా కీలక రాష్ట్రమే. బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లు ఆ రాష్ట్రానికి చెందినవారే. గుజరాత్ అఖండ విజయం వెలుగులో ఈ ఓటమి పెద్దగా కనిపించకపోయినా ఇది నగుబాటు వ్యవహారమే. ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా పనిచేయడం ద్వారా అది ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనవలసి ఉంటుంది.

ప్రతిభా సింగ్​ ప్రభావం

వీరభద్ర సింగ్ బుషహర్ రాజ సంస్థానానికి చెందినవారు. హిమాచల్ ​రాజకీయాల్లో ఆయన ప్రాబల్యం సుదీర్ఘకాలం కొనసాగింది. ఆయన భార్యగా ఆ సంస్థానానికి మహారాణి  ప్రతిభా సింగ్. ఆమెను హిమాచల్​కు తొలి మహిళా ముఖ్యమంత్రిని చేస్తే  కొడిగడుతున్న దీపానికి కాంగ్రెస్ చమురు పోసుకున్నట్లు అవుతుంది.  నిజానికి, ప్రతిభా సింగ్ ఈ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే తన రాజకీయ చాతుర్యాన్ని చాటుకున్నారు. మండి లోక్ సభ సభ్యుడుగా ఉన్న రామ్ స్వరూప్ శర్మ మృతితో ఉప ఎన్నిక జరిగింది. ఇందులో బీజేపీ అభ్యర్థి, బ్రిగేడియర్ కుశాల్ ఠాకూర్​ను ఓడించి ప్రతిభా సింగ్ వార్తలకెక్కారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను విజయ పథాన నడిపించడం ద్వారా ఆమె తన నాయకత్వ పటిమను సుస్థిరపరచుకున్నారు. 68 స్థానాలున్న హిమాచల్​ అసెంబ్లీలో కాంగ్రెస్ 40 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 25కి పరిమితమైంది. ఆప్​ ఖాతా తెరవలేదు. ఇతరులు 3 స్థానాలకు పరిమితమయ్యారు. హిమాచల్ ఓటర్లు 1985 నుంచి  ప్రతి ఎన్నికల్లో అధికారాన్ని మారుస్తూ వస్తున్నారు. ఇద్దరు ప్రజాదరణ పొందిన సీఎంలు వీరభద్ర సింగ్ (కాంగ్రెస్), ప్రేమ్ కుమార్ ధూమల్ (బీజేపీ) కూడా ఈ రివాజులో మార్పు తీసుకురాలేకపోయారు. 

- మల్లంపల్లి ధూర్జటి
సీనియర్​ జర్నలిస్ట్​