
- యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మె పాటించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చింది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన పనితీరు సమీక్ష, పీఎస్ఐ మార్గదర్శకాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ సమ్మెకు దిగుతున్నట్లు యూఎఫ్ బీయూ రాష్ట్ర యూనిట్ కన్వీనర్ కె.ఆంజనేయప్రసాద్ తెలిపారు.
నారాయణగూడలోని ఎస్ బీఐఓఏ భవన్లో బుధవారం బ్యాంక్ యూనియన్స్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాయి. కె.ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ పనితీరు సమీక్ష, పీఎస్ఐపై ఆదేశాలు 8వ జాయింట్ నోట్‌ను ఉల్లంఘిస్తాయన్నారు. ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగించడంతోపాటు, ఉద్యోగులు, అధికారుల మధ్య విభజన, వివక్షను సృష్టించే అవకాశం ఉందన్నారు. పీఎస్ బీలలో కార్మికులు, ఆఫీసర్లు, డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని, ఐబీఏ వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బ్యాంకింగ్ రంగంలో శాశ్వత ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానంతో భర్తీ చేయడం నిలిపివేయాలన్నారు. ఐడీబీఐలో ప్రభుత్వ వాటాను కనీసం 51 శాతం కొనసాగించాలని కోరారు. 23 అర్ధరాత్రి నుంచి 25 అర్ధరాత్రి వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. యూఎఫ్‌బీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు, కె.ఎస్.శాండిల్య, ఐ.కృష్ణంరాజు, హత్కర్ శంకర్, వెంకటరామయ్య, ఫణి, అర్జున్ పాల్గొన్నారు.