- యునైటెడ్ నేషన్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అవార్డుకు ఎంపిక
యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్... దేశంకాని దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రాణాలు పణంగా పెడుతుంది. కానీ, దేశాల్లో వాళ్లలో వాళ్లకు జరిగే యుద్ధాలనుంచి అంతుచిక్కని వ్యాధులు నుంచి ప్రజల్ని కాపాడే బాధ్యత తీసుకుంటుంది. ఇందులో పనిచేసే సైనికులు కష్టమైన పరిస్థితుల్లో కూడా నవ్వుతూ జనంతో కలిసిపోతారు. అలాంటివాళ్ల ఆరోగ్యం దెబ్బతినకుండా, వాళ్లకి ఏ ప్రమాదం జరగకుండా చూసుకుంది సూపరింటెండెంట్ సంగ్యా మల్లా. అందుకు గాను యునైటెడ్ నేషన్స్ ఈ ఏడాది సంగ్యాని ‘యుఎన్ విమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకి ఎంపిక చేసింది.
వివిధ దేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు, మహిళా సాధికారతకు పాటుపడుతున్న మహిళా పోలీసు ఆఫీసర్ల కృషిని గుర్తించాలని ‘యుఎన్ విమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ ఇవ్వడం మొదలు పెట్టారు. 2011 నుంచి ప్రతి ఏడాది శాంతి స్థాపనలో అత్యుత్తమ సేవలు అందించిన విమెన్ పోలీస్ ఆఫీసర్లకి ఈ అవార్డు ఇస్తున్నారు.
సంగ్యాది నేపాల్. 2008లో సబ్ఇన్స్పెక్టర్గా పోలీసు ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత కొన్నాళ్లకు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లోకి వెళ్లింది. మెడికల్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకూ అంతే ప్యాషన్‌తో పనిచేస్తుంది. ఇప్పుడు ఆమె డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చేపట్టిన స్టెబిలైజేషన్ మిషన్‌లో (మొనస్కో)లో పనిచేస్తోంది. మొనస్కో పోలీస్ హెల్త్, ఎన్విరాన్మెంట్ యూనిట్ ఛీఫ్‌గా ఉన్న సంగ్యా కరోనా ప్యాండెమిక్, ఎబోలా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో కీలకంగా పనిచేసింది. కాంగోలో జనాన్ని అలర్ట్ చేయడం కోసం 300లకి పైగా కరోనా అవేర్నెస్ సెషన్స్ నిర్వహించింది. ప్రకృతి విపత్తులు వంటి ఎమర్జెన్సీ టైమ్‌లోనూ జనాన్ని సురక్షిత ప్రాంతాలకి తరలించింది సంగ్యా టీమ్. అంతే కాదు పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు కూడా పెంచేది. ఆమె సేవల్ని గుర్తిస్తూ ఈ ఏడాది ‘యుఎన్ విమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్–2021’ అవార్డుకి ఎంపిక చేశారు. వర్చువల్ సెర్మనీలో యునై టెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గట్టర్స్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుంది సంగ్యా.
ఆమె డెడికేషన్ మెచ్చుకోదగ్గది
‘‘కాంగోలో ‘మొనస్కో’ హెల్త్, ఎన్విరాన్మెంట్ యూనిట్ ఏర్పాటుచేయడంలో, దాన్ని సమర్థంగా నడిపించడంలో సంగ్యా అంకితభావం మెచ్చుకోదగ్గది. పీస్ కీపింగ్ ఫోర్స్ సేఫ్టీ, హెల్త్ కోసం ఈ సంస్థ ఎంతగానో పాటుపడింది. కరోనా, ఎబోలాతో పాటు ఇతర ప్రాణాంతక జబ్బులు సోకకుండా ఐక్యరాజ్యసమితి పీస్ కీపింగ్ ఫోర్స్‌ని కాపాడడంలో సంగ్యా సేవలు, చేసిన కృషి వెలకట్టలేనిది. అంటూ సంగ్యా సేవల్ని మెచ్చుకున్నారు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గట్టర్స్.
ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తుంది
‘‘ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. మా దేశం, ఇతర దేశాల్లోని ఎంతోమంది అమ్మాయిలు పోలీసు ఉద్యోగాన్ని కెరీర్‌గా ఎంచుకునేలా ఈ అవార్డ్ వాళ్లని ఎంకరేజ్ చేస్తుందని నమ్ముతున్నా” అని చెబుతోంది సూపరింటెండెంట్ సంగ్యా.