30 రోజుల్లో వెళ్లిపోండి.. అక్రమ వలసదారులకు ట్రంప్ అల్టిమేటం

30 రోజుల్లో వెళ్లిపోండి.. అక్రమ వలసదారులకు ట్రంప్ అల్టిమేటం
  • నెల కంటే ఎక్కువ ఉండాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
  • అక్రమంగా ఉంటే జరిమానా విధిస్తాం
  • మర్యాదగా తట్టాబుట్టా సర్దుకొని ఫ్లైట్ ఎక్కాలని ఆదేశం

వాషింగ్టన్: అక్రమంగా అమెరికాలో సెటిల్ అవుదామని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ఆధ్వర్యంలోని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్​మెంట్ హెచ్చరించింది. సరైన పత్రాల్లేకుండా అమెరికాలో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. 30 రోజుల కంటే ఎక్కువ అమెరికాలో ఉండాలనుకునేవాళ్లు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. అలా చేయకపోతే భారీ జరిమానా లేదంటే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది.

రిజిస్టర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే వెంటనే తట్టాబుట్టా సర్దుకుని ఫ్లైట్ ఎక్కి అమెరికా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. సొంతంగా అమెరికాను వీడటమే అందరికీ మంచిదని సూచించింది. ఎలాంటి క్రిమినల్ బ్యాక్​ గ్రౌండ్ లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న డబ్బును దాచుకొని బయల్దేరాలని ఆదేశించింది. ఈ విధానం ‘సెల్ఫ్- డిపోర్టేషన్’ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిందని ట్వీట్​లో పేర్కొన్నది.

టికెట్లపై రాయితీలు ఇస్తాం
స్వచ్ఛందంగా అమెరికాను వీడాలనుకునేవాళ్లకు ప్రభుత్వం హెల్ప్ చేస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్​మెంట్ వివరించింది. ఫ్లైట్ టికెట్ కొనేందుకు డబ్బుల్లేకపోతే.. రాయితీపై టికెట్ ఇప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపింది. నిబంధనలు పాటించకపోతే వెంటనే అమెరికా నుంచి పంపిచేస్తామని పేర్కొన్నది. ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ కాపీ అందుకున్న వాళ్లు వీలైనంత త్వరగా ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోవాలని సూచించింది. ఒక్క రోజు ఎక్కువ ఉన్నా... రోజుకు రూ.86 వేల ఫైన్ కట్టాల్సి ఉంటుందని తెలిపింది. సొంతంగా వెళ్లిపోకపోతే రూ.86 వేల నుంచి రూ.4.30 లక్షల వరకు ఫైన్‌‌‌‌‌‌‌‌ విధిస్తామని స్పష్టం చేసింది.

ఒక్కోసారి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలాంటి వారికి భవిష్యత్తులో లీగల్​గా కూడా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉండదని స్పష్టంచేసింది. కాగా, స్టూడెంట్ పర్మిట్లు, వీసాలతో  అమెరికాలో ఉన్నోళ్లకు ఈ రూల్​ వర్తించదు. కానీ.. సరైన అనుమతి లేకుండా అమెరికాలో ఉన్న విదేశీయులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. హెచ్ 1బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయినా ఈ నిబంధన వర్తించదు. ఇలాంటి వారికి కొంత టైమ్ ఉంటుంది.

స్టెప్పులేసిన ట్రంప్
ఫ్లోరిడాలోని మియామిలో ఆదివారం నిర్వహించిన అల్టిమేట్‌‌‌‌‌‌‌‌ ఫైటింగ్‌‌‌‌‌‌‌‌ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ (యూఎఫ్​సీ 314) కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు.. ట్రంప్ క్యాప్‌‌‌‌‌‌‌‌లు ధరించి స్టాండింగ్ ఒవేషన్​తో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభిమానులంతా ‘యూఎస్ఏ’ అంటూ నినాదాలు చేశారు. మేక్​ అమెరికా.. గ్రేట్ అమెరికా స్లోగన్​తో ఉన్న టోపీలు ధరించారు.

ఓ పాటకు అభిమానులతో కలిసి స్టెప్పులేశాడు. రెండు చేతులు ఊపుతూ.. అభిమానులను ఉత్సాహపరిచారు. దీంతో ట్రంప్ చేసిన డ్యాన్స్​ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నది. ఈ ప్రోగ్రామ్​కు ఎలాన్‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌‌‌‌‌, రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్, కాష్ పటేల్, మార్కో రూబియో, తులసీ గబ్బార్డ్‌‌‌‌‌‌‌‌, ట్రంప్‌‌‌‌‌‌‌‌ మనవరాలు కాయ్‌‌‌‌‌‌‌‌ ట్రంప్‌‌‌‌‌‌‌‌ తదితరులు హాజరయ్యారు. కాగా, ట్రంప్​కు గతంలో వరల్డ్‌‌‌‌‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌లో భాగస్వామ్యం ఉండేది.