క్రికెట్ లో అమెరికా పెద్దగా రాణించింది లేదు. పసికూన జట్టుగా ఆ జట్టు పనికిరాదు. అదృష్టవశాత్తు వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. అయితే ఇవన్నీ నిన్నటివరకు వినిపిస్తున్న మాటలు. ప్రస్తుతం అమెరికా జట్టు క్రికెట్ లో తన సత్తా చూపిస్తుంది. సమిష్టిగా మెరుగైన క్రికెట్ ఆడుతూ తన ఉనికిని చాటుకుంటుంది. వరల్డ్ కప్ కు ఆతిధ్యమిచ్చి అందరి దృష్టిలో పడిన ఈ జట్టు.. తాజాగా జరిగిన టీ20లో బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చింది.
మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మంగళవారం (మే 21) జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. దీంతో వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 153 పరుగులు చేసింది. 154 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికా 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. న్యూజీ లాండ్ మాజీ స్టార్ క్రికెటర్ కోరే అండర్సన్ (34*), హర్మిత్ సింగ్ (13 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సులతో 33) చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.
బంగ్లాదేశ్ పూర్తి స్థాయి జట్టుతో దిగినా అమెరికాను ఓడించలేకపోయింది. షకీబ్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, శాంటో, ముస్తాఫిజుర్, మెహదీ హసన్, మహ్మద్దుల్లా లాంటి ప్రపంచ గుర్తింపు పొందిన స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ పసికూన అమెరికా ఆట తీరుకు తలవంచక తప్పలేదు. ఈ మ్యాచ్ ద్వారా అమెరికా భారత్, పాక్ లకు హెచ్చరికలు పంపింది. జూన్ 1 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ లో ఈ మూడు జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. కెనడా, ఐర్లాండ్ మరో రెండు జట్లు. దీంతో పసికూన అమెరికా అని తేలిగ్గా తీసుకుంటే ప్రమాదం తప్పదని చెప్పకనే చెప్పింది.
USA beat Bangladesh in their first meeting in men's T20Is in a thrilling match in Houston 🔥
— ICC (@ICC) May 21, 2024
The co-hosts ramp up their #T20WorldCup preparations with a stunning victory! #USAvBAN 📝: https://t.co/TM2WIVwhAE pic.twitter.com/aovBUIKziC