సమైక్యతా ఉత్సవాలు ఇంతకుముందు ఎందుకు చేయలేదు

నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పిస్తూ భారత సైనిక దళాలు1948 సెప్టెంబర్17న హైదరాబాద్​కు స్వాతంత్య్రం కల్పించాయి. ఈ ఘటన జరిగి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా 1998 సెప్టెంబర్ 17న నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్‌‌కే అద్వానీ వందలాది స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేశారు. నిజాంపైన బాంబు వేసినందుకు ఉరిశిక్షకు గురైన పవార్, వందేమాతరం శ్రీనివాస్ ను కూడా రాజకీయాలకు అతీతంగా సన్మానించారు.              

ఉమ్మడి రాష్ట్రంలో..

ఏటా సెప్టెంబర్17ను ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోనూ అధికారికంగా విమోచన దినంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ వచ్చా యి. 2022 సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణకు విమోచన లభించి 74 ఏండ్లు పూర్తయి, 75లోకి అడుగు పెడుగుతున్న సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ షిండే, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైలను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ సెప్టెంబర్​17న సికింద్రాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సంవత్సరం అంతా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినాలు నిర్వహించి నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగిన బైరాన్‌‌పల్లి, పరకాల వంటి ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొమురంభీం, షోయబుల్లాఖాన్ లాంటి పోరాట యోధుల కుటుంబాలను కలిసి సత్కరించాలని నిర్ణయించారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా నిజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల పేరుతో ఏడాదిపాటు ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం అటు టీఆర్ఎస్ పార్టీని ఇటు ఎంఐఎం పార్టీని కదిలించాయి. 

నిజాం అరాచకాలు అన్నీ ఇన్నీ కావు..

నిజాం నవాబు అరాచకాలపై ఎన్నో పల్లెలు పోరాడాయి. ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్‌‌పల్లిపై1948 ఆగస్టు 27న రజాకార్లు దాడి చేశారు. మహిళల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ 120 మందిని ఒకే రోజు హత్య చేశారు. వరంగల్ జిల్లా పరకాలలో 1947 సెప్టెంబర్ 2న జాతీయ జెండాను అక్కడి ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ఎగురవేస్తుండగా రజాకార్లు కత్తులు, బరిసెలతో దాడి చేసి అక్కడ గుమిగూడిన ప్రజలందరిపై దాడులు చేశారు. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న 200 మందిని దారుణంగా చంపారు.  నిజాం నిరకుంశ పాలనపై ఎందరో పోరాటం చేసి అమరులయ్యారు.

విముక్తి పోరాటంలో ముస్లింల పాత్ర

క్రీ.శ1798లో నిజాం అలీఖాన్ ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందం చేసుకోవడాన్ని హైదరాబాద్​లోని చాలా మంది ముస్లింలు వ్యతిరేకించారు. 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న తుర్రేబాజ్‌‌, అల్లా ఉద్దీన్‌‌లను బ్రిటషర్లు ఉరి తీశారు. ఔరంగాబాద్​కు చెందిన జమ్ దారు చాదాఖాన్ నాయకత్వంలో కౌండు అశ్వికులు ఆంగ్లేయులకు వత్తాసు పలుకుతున్న సాలార్‌‌జంగ్‌పై పోరాడి ఓడిపోగా వారిని సాలార్ జంగ్ బ్రిటీష్ సైన్యానికి అప్పగించాడు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని కోరుకుంటూ జర్నలిస్టు షోయబుల్లాఖాన్ తన పత్రిక ‘ఇమ్రోజ్’లో వ్యాసం రాశారు. అది తట్టుకోలేని నిజాం తన గూండాలతో దాడి చేయించి కత్తులతో పొడిపించి ఆయనను పాశవికంగా హత్య చేయించాడు. మెదక్ జిల్లా అందోలుకు చెందిన ఉర్దూ రచయిత మగ్దూం మోహియుద్దీన్ తన కవితతో నిజాం అరాచకాలను ఎదిరించినందుకు నిజాం ఆయనను జైలులో పెట్టాడు. ఇలా నిజాం విముక్తి పోరాటంలో పాల్గొన్న ముస్లింలు త్యాగధనులుగా పేరొందారు.  కానీ రజాకార్లకు కొనసాగింపుగా వచ్చిన ఎంఐఎం పార్టీ సెప్టెంబర్​17ను విమోచన దినోత్సవంగా జరపలేదు. ముస్లిం పోరాట యోధులను ఎన్నడూ  స్మరించిందీ లేదు.

అప్పుడు వ్యతిరేకించిన పార్టీలు ఇప్పుడు ఓకే చెప్పాయి..

తెలంగాణలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తే, మైనార్టీలకు వ్యతిరేకిగా ముద్రపడుతానని, బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని భావించిన ముఖ్యమంత్రి ఉత్సవాలు జరపలేదు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రోశయ్య హయాంలో సెప్టెంబర్​17ను విమోచన దినోత్సవంగా రాష్ట్ర సర్కారు ఎందుకు నిర్వహించదో చెప్పాలని డిమాండ్​ చేసిన కేసీఆర్.. ఇప్పుడు తానే ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఎనిమిదేండ్లలో వేడుకలు నిర్వహించలేదు. దీన్ని గమనించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం తామే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఇటు కేసీఆర్​కు, అటు మజ్లీస్​కు రాజకీయ అనివార్యతను సృష్టించింది. దీంతో తప్పని పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్​ ప్రభుత్వం సెప్టెంబర్​17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపనున్నట్లు ప్రకటించింది. విమోచన దినాన్ని ఇంతకాలం వ్యతిరేకిస్తూ వచ్చిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు దిగి వచ్చి  ‘‘మేము ఎప్పుడూ సెప్టెంబర్​17 ఉత్సవాలను జరపకూడదని అనలేదు’’అని అన్నది. నిజాం వారసులు ప్రస్తుతం తెలంగాణలో ఎవరూ లేరని, వారంతా పాకిస్తాన్ వెళ్లిపోయారని, ప్రస్తుతం తెలంగాణలోని ముస్లింలంతా భారతీయులేనని ప్రకటించారు. దీంతోపాటు సెప్టెంబర్17 న హైదరాబాద్ లోని ముస్లింలంతా త్రివర్ణ పతాకం చేపట్టి వీధుల్లో భారీ ర్యాలీ తీయాలని, జాతీయ సమైక్యత దినంగా పాటించనున్నట్లు వెల్లడించారు. ఇటు అధికార టీఆర్ఎస్, మజ్లిస్​ రెండు పార్టీలు మునుపెన్నడూ లేనిది ఈ సెప్టెంబర్​17న వేడుకలు నిర్వహించడానికి కారణం బీజేపీ చేసిన పోరాటమే! 

- కపిలవాయి దిలీప్, మాజీ ఎమ్మెల్సీ