4 సెంటీమీటర్ల వర్షపాతానికే విశ్వనగరాలు విలవిల

శతాబ్దాల చరిత్ర కలిగిన ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మన మహా నగరాలు 4 సెంటీమీటర్ల వర్షపాతానికే ఇటీవల కాలంలో చిగురుటాకులా వణికిపోతున్నాయి.‌‌‌‌ ఈ ఆధునిక కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఈ నగరాలు, కొద్ది పాటి వర్షానికే గజగజ వణికిపోతున్న సందర్భంగా, ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలబెడతాం అని, 500 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా భవిష్యత్తులో తీర్చిదిద్దుతాం అని చెబుతున్న పాలకులు, ఇకనైనా వరద నీటి మేనేజ్మెంట్ పై దృష్టి కేంద్రీకరించాలి.‌‌‌‌ 

వరదల్లో దేశ రాజధాని

తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీకి సంభవించిన యమునా నది వరదలతో ఎంత ప్రమాదం పొంచి ఉందో మనకు తెలియపరుస్తుంది. ఎర్రకోట, సీఎం నివాసాలను కూడా వరద చుట్టు ముట్టింది.‌‌‌‌ దీనిని బట్టి భవిష్యత్తులో దేశ రాజధాని ఢిల్లీని రక్షించుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో పాలకులు గ్రహించాలి.‌‌‌‌ ఏదైనా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రకృతి వైపరీత్యాలని, పర్యావరణ ప్రభావం అని సరిపెట్టుకోకుండా, శాస్త్రీయ దృక్పథంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు, మురుగునీటి కాలువల నిర్మాణం, నిర్వహణపై దృష్టి సారించాలి.‌‌‌‌

ఆర్థిక రాజధాని ముంబై దుస్థితి

 దేశ ఆర్థిక రాజధాని ముంబై గత రెండు దశాబ్దాలుగా వర్షాకాలంలో తీవ్రమైన సమస్యలతో సతమతమవుతున్నది. 2005, జులై 26వ తేదీన కురిసిన సుమారు 944 మిల్లీ మీటర్ల వర్షపాతంతో ముంబై అతలాకుతలం అయింది.‌‌‌‌ సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు, 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది అని నివేదికలు చెబుతున్నాయి.‌‌‌‌ అంతేకాకుండా 2017లోనూ ముంబై వర్షాకాలంలో చిగురుటాకులా వణికిపోయింది.‌‌‌‌ సుమారు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టే ముంబై మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం వరదల నుంచి ప్రజలను, ఆస్తులను, నగరాన్ని కాపాడుకోవడానికి ఏమి చర్యలు తీసుకుందో తెలియదు.  నేడు కూడా 15 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే, అనేక నివాస ప్రాంతాలు మునిగిపోతూ, మన అభివృద్ధి ఏమిటని  ప్రశ్నిస్తున్నాయి.

చెన్నై, బెంగళూరుకు ముంపు

ఇక దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నగరంగా బ్రిటిష్ కాలం నుండి ప్రాచుర్యం పొందిన చెన్నై ఇటీవల కాలంలో అతలాకుతలం అవుతోంది.‌‌‌‌ 2015లో సంభవించిన 10రోజులు ఎడతెగని వర్షం కారణంగా, అనేక ప్రాంతాలు జలమయం అయి,  సుమారు 32 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈ పరిస్థితికి ఖంగు తిన్న అనేక టెక్ కంపెనీలు చెన్నై ను విడిచి, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళాయి. 2022లో కర్ణాటక రాజధాని బెంగళూరు వర్షాకాలంలో అతలాకుతలమైంది.‌‌‌‌ ఆస్తి, ప్రాణ నష్టాలు చవిచూసింది.

 వరదలు, ముంపులు హైదరాబాద్ సొంతం!

 ఇక అన్నింటా అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ కూడా వర్షాకాలంలో తరచూ ముంపునకు గురవుతూ, ఆస్తి ప్రాణ నష్టాలు చవిచూస్తోంది. 2003లో  వరద నీటి నుండి నగరాన్ని కాపాడుకోవడానికి కిర్లోస్కర్ కమిటీ నివేదికను ఇప్పటికీ సరిగా అమలు చేయలేదు.‌‌‌‌ 2007లో మాస్టర్ ప్లాన్ రూపొందించినా నగర అభివృద్ధికి, వరద, ముంపు సమస్యల పరిష్కారానికి పటిష్టంగా చర్యలు తీసుకోలేదు. సుమారు 100 సంవత్సరాల క్రితం నిజాం నవాబు ఏర్పాటు చేసిన మురుగు నీటి సౌకర్యాలు, పైప్​లైన్లు నేటికీ అనేక చోట్ల దర్శనమిస్తాయి. నేటి జనాభాకు అనుగుణంగా సరిపోవడం లేదు.‌‌‌‌  వర్షాకాలం వచ్చిందంటేనే హైదరాబాద్​ వణికిపోతున్నది.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచలేదు. మరీ ముఖ్యంగా చెరువులు, కాలువలు అక్రమంగా ఆక్రమణకు గురై, నీటి పారుదల సౌకర్యాలకు ఆకటం ఏర్పడి తరచూ పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.  వర్షాలు పడిన సందర్భాల్లో,  యన్డీఆర్ఎఫ్​, యస్.డీఆర్​ఎఫ్ వంటి దళాల సహకారంతో కొన్ని ఉపశమన కార్యక్రమాలు చేపడుతూ, పాలకులు చేతులు దులుపుకుంటున్నారు. అంతేకానీ, శాశ్వత పరిష్కారం మార్గాలు చూపడం లేదు.‌‌‌‌ నగరాలను నరకకూపాలుగా ఇంకెన్నాళ్లు చూడాలనేదే ప్రశ్న.

- ఐ.ప్రసాదరావు, సోషల్​ ఎనలిస్ట్​