యూనివర్శిటీలకు నిధుల్లేవ్..నియామకాల్లేవ్

ఒకప్పుడు యూనివర్సిటీలంటే ఆహ్లాదకరమైన వాతావరణం, సీనియర్ ప్రొఫెసర్లు, మంచి ఎడ్యుకేషన్, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు, సైద్ధాంతిక చర్చకు వేదికలుగా నిలిచేవి. కానీ ఇప్పుడు అలాంటిదేమీ కనిపించడం లేదు. ప్రస్తుతం యూనివర్సిటీలన్నీ డిగ్రీ కాలేజీలకు ఎక్కువ.. పీజీ కాలేజీలకు తక్కువ అన్నట్టుగా మారాయి. దీనికి నిధుల్లేకపోవడం.. ఏండ్లుగా నియామకాలు చేపట్టకపోవడమే కారణం. ఉస్మానియా వర్సిటీ పేరు వినిపిస్తే ఓఉద్యమ వేదిక మన కండ్లముందు కదలాడుతుంది. అలాంటి వర్సిటీ ఇప్పుడు సర్కారు చర్యలతో విలవిల్లాడుతోంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన వర్సిటీలన్నీ ప్రస్తుతం ఆలనాపాలనా కరువై అనాథలుగా మిగిలాయి.

రాష్ట్రంలో 15 స్టేట్ యూనివర్సిటీలు ఉండగా వాటిలో ఆరు కన్వెన్షనల్(సంప్రదాయ) వర్సిటీలు, 9 స్పెషలైజ్డ్ వర్సిటీలు. వీటిలో 11 వర్సిటీలు విద్యా శాఖ పరిధిలో కొనసాగుతుండగా, అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్ రెండు, హెల్త్, వెటర్నరీ డిపార్ట్​మెంట్ల కింద ఒక్కొక్కటి పనిచేస్తున్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​కింద కొనసాగుతున్న 11 వర్సిటీల్లోనూ వీసీ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్ని వర్సిటీలకూ ఇన్​చార్జీ వీసీలుగా సీనియర్ ఐఏఎస్​లే కొనసాగుతున్నారు. దీంతో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత యూనివర్సిటీలన్నీ బాగు పడుతాయని అంతా భావించారు. కానీ స్వరాష్ట్రంలోనే వర్సిటీలు ఎక్కువ వివక్షకు గురవుతున్నాయి. ఉద్యమ కేంద్రాలుగా ఉన్న వర్సిటీల్లోకి అడుగుపెట్టేందుకు పాలకులంతా భయపడుతున్నారు. సీఎం కేసీఆర్​ కూడా ఇదే కోవలోకి వస్తారు. ఘన చరిత్ర కలిగిన ఓయూ ఉత్సవాలకూ నామమాత్రంగా నిధులు కేటాయించడమే కాక, వాటికి కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. అది కూడా రాష్ట్రపతి రావడంతోనే వచ్చారనే వాదనలూ ఉన్నాయి. ఉద్యమ సమయంలో, 2014 ఎన్నికల సమయంలో యూనివర్సిటీలను బ్రహ్మాండంగా మారుస్తానని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి.

ఖాళీలే ఖాళీలు..

యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు లేక పరిశోధనలన్నీ అటకెక్కాయి. చారిత్రక ఓయూలోనూ పదుల సంఖ్యలో డిపార్ట్​మెంట్లకు ప్రొఫెసర్లు లేకపోవడం బాధాకరం. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వర్సిటీల్లో రిక్రూట్​మెంట్​ చేయలేదు. ఇటీవల విద్యా శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం 11 వర్సిటీల్లో మొత్తం 2,837 సాంక్షన్డ్​ పోస్టులుండగా, వాటిలో 968 మంది టీచింగ్ స్టాఫ్ మాత్రమే పనిచేస్తున్నారు. అంటే మిగిలిన 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మొత్తం 395 ప్రొఫెసర్ల పోస్టులుంటే, దాంట్లో 238 ఖాళీలే. కొత్త యూనివర్సిటీలు, పాత వర్సిటీలు అనే తేడా లేకుండా అన్నింటిలోనూ ఖాళీలే దర్శనమిస్తున్నాయి. నాలుగేండ్ల కింద 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ వివిధ కారణాలతో ఇప్పటికీ ఆ పోస్టులను భర్తీ చేయలేదు. రెగ్యులర్ వీసీలు లేకపోవడమూ భర్తీకి ఓ ఆటంకంగా మారింది. అయితే శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ తదితర ఆరు యూనివర్సిటీల్లో డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ ద్వారా నియమితుడైన ఒక్క ప్రొఫెసర్ కూడా లేడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శాతవాహన, ఆర్జీయూకేటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల్లో డైరెక్టర్ రిక్రూట్​మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓయూలో 54 డిపార్ట్​మెంట్లుంటే, 12 డిపార్ట్​మెంట్లలో ప్రొఫెసర్లే లేరు. ఆరేడు డిపార్ట్​మెంట్లలో ఒక్క రెగ్యులర్ ఎంప్లాయీ కూడా లేడు. దీంతో పలు ఫారిన్ కోర్సుల్లో స్టూడెంట్లు అడ్మిషన్లు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

వర్సిటీలకు పైసలియ్యట్లె... 

వర్సిటీల్లోనే కాదు ఎక్కడ ఏ పనిచేయాలన్నా.. నిధులు అవసరం. మేధావులను తయారు చేసే వర్సిటీలకు ఎన్ని నిధులు కేటాయించినా తక్కువే. అలాంటి వర్సిటీల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. కనీసం వర్సిటీల్లో పనిచేసే సిబ్బంది జీతాలకు సరిపడ నిధులు కూడా కేటాయించడం లేదు. 2021-–22 సంవత్సరానికి  వర్సిటీల అభివృద్ధికి పైసా కేటాయించలేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలోని 8 వర్సిటీలకు నిర్వహణ పద్దు కింద బడ్జెట్​లో రూ.551.74 కోట్లు, టెక్నికల్ ఎడ్యుకేషన్​ పరిధిలోని మూడు యూనివర్సిటీలకు రూ.87.23 కోట్లు కేటాయించింది. ఇవన్నీ ఏ మూలకూ సరిపోవు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి మాత్రమే ప్రగతి పద్దు కింద రూ.3 కోట్లు కేటాయించారు. నిధుల్లేక వర్సిటీలు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆదాయం పెంచుకునేందుకు స్టూడెంట్లపై ఫీజుల భారం వేస్తున్నాయి. నిధుల్లేక అన్ని వర్సిటీల్లోనూ డెవలప్​మెంట్ పనులు ఆగిపోయాయి.  కాకతీయ వర్సిటీలో నాలుగు బిల్డింగ్​ల పనులు రూ.1.6 కోట్లు ఖర్చు చేసిన తర్వాత, బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. 8 ఏండ్ల నుంచి వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం పైసలు ఇవ్వకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ విషయాన్ని ఇటీవల కాగ్ తన రిపోర్టులో పేర్కొన్నది. ఇలాంటివే అన్ని వర్సిటీల్లోనూ కనిపిస్తున్నాయి.

ఐదు ప్రైవేటు వర్సిటీలకు పర్మిషన్ 

2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. దీంట్లో మూడు టీఆర్ఎస్ లీడర్లవే. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి, టీఆర్ఎస్ లీడర్ వరదారెడ్డికి ఒక్కో వర్సిటీ ఉన్నది. వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం అనేక మినహాయింపులు ఇచ్చింది. అసలు ఈ వర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవు. ఫీజులు వారి ఇష్ట ప్రకారమే నిర్ణయించుకోవచ్చు. మంత్రి మల్లారెడ్డి ముందుగా మహిళా యూనివర్సిటీ అని పర్మిషన్ తీసుకుని, మళ్లీ జనరల్ వర్సిటీకి మార్చుకున్నారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో 25 శాతం సీట్లు లోకల్ స్టూడెంట్లకు ఇస్తామని యాక్ట్ లో తెలిపారు. ఇది చూసి చాలామంది తెలంగాణ వాళ్లకు కొన్నైనా సీట్లు వస్తాయని ఆశపడ్డారు. కానీ తెలంగాణలో రెండేండ్లు చదివినా, ఉన్నా లోకల్​ గానే పరిగణిస్తామని ప్రకటించారు. స్టూడెంట్ల పేరెంట్స్​ ఎక్కడి వారైనా, వారు ఇక్కడ రెండేండ్లు పనిచేసినా వారికీ ఈ లోకల్ కోటా వర్తిస్తుంది. ఇది పూర్తిగా మేనేజ్​మెంట్ల లబ్ధి కోసం చేసిందే. అసలు ప్రైవేటు వర్సిటీలే వద్దని స్టూడెంట్ల యూనియన్లు, విద్యావేత్తలు ఆందోళనలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 2021–22 అకడమిక్ ఇయర్​లో మరో ఐదారు ప్రైవేటు వర్సిటీలు రావొచ్చని ఆఫీసర్లు అంటున్నారు. ఇలా ప్రైవేటు వర్సిటీల సంఖ్య పెరిగితే, సర్కారు వర్సిటీలను పాలకులు పట్టించుకుంటారా?

వీసీల్లేక ఆగమైతున్నయ్

రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు.. 11వర్సిటీల్లో వైస్ చాన్స్​లర్లు లేరు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆర్జీయూకేటీ(బాసర ట్రిపుల్​ఐటీ)కి వీసీనే పెట్టలేదు. కరీంనగర్​లోని శాతవాహన వర్సిటీకి ఆరేండ్లుగా వీసీ లేరు. జేఎన్​ఏఎఫ్​ఏయూకు ఏడాదికి పైగా, మిగిలిన వర్సిటీలకు రెండేండ్లుగా రెగ్యులర్ వీసీలు లేరు. అన్నింటికీ ఇన్​చార్జ్​లుగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కొనసాగుతున్నారు. తమతమ డిపార్ట్​మెంట్ల పనులతో వారు బిజీగా ఉంటుండటంతో, వర్సిటీలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. రెండేండ్ల కిందనే వీసీల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంట్లో ఆర్జీయూకేటీ, జేఎన్​ఏఎఫ్ఏయూ మినహా మిగిలిన వర్సిటీలకు 984 అప్లికేషన్లు వచ్చాయి. మూడు నెలల కిందనే వీసీల సెర్చ్ కమిటీలు కూడా పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ కొత్త వీసీలు మాత్రం రాలేదు. వీసీలు లేకపోవడంతో వర్సిటీల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. పాలనాపరమైన అనేక పనులు పెండింగ్​లో పడ్డాయి. అన్ని వర్సిటీలకు ఐఏఎస్​ఆఫీసర్లు ఇన్​చార్జ్​ వీసీలుగా ఉండటంతో, బడ్జెట్​ కేటాయింపులపై సర్కారుపై ఒత్తిడి తీసుకురాలేదు. ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోయారు. దీంతో వర్సిటీల అభివృద్ధికి పైసా రాలేదు.
- గండ్ర నవీన్