వచ్చే ఏడాది నుంచి పల్లె విద్యార్థులకు ఇంటి వద్దకే వర్సిటీలు

వచ్చే ఏడాది నుంచి పల్లె విద్యార్థులకు ఇంటి వద్దకే వర్సిటీలు
  • ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో యూజీసీ చైర్మన్​ జగదీశ్​కుమార్​
  • ఆన్​లైన్​ చదువులతో వర్సిటీలను దగ్గర చేస్తం
  • అందుకోసం మంచి వర్సిటీలు, కాలేజీలను ఎంపిక చేసినం
  • వచ్చే ఏడాది నుంచే అమలు చేస్తం
  • ఉద్యోగాల కోసమే డ్యుయల్​ డిగ్రీ తీసుకొచ్చినం 
  • డిజిటల్​ వర్సిటీ చదువులపై అనుమానాలొద్దు
  • సొంత భాషలో ప్రొఫెషనల్​ కోర్సులని వెల్లడి
  • వీ6, వెలుగు ఇంటర్వ్యూలో యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్

న్యూఢిల్లీ, వెలుగు: విద్యారంగం, ఆన్​లైన్​ ఎడ్యుకేషన్​లో మార్పులు తీసుకొస్తున్నామని, దానికి సంబంధించిన గైడ్​లైన్స్​ను ఇప్పటికే యూనివర్సిటీల వీసీలకు పంపించా మని యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిష న్​ (యూజీసీ) చైర్మన్​ జగదీశ్​ కుమార్​ చెప్పారు. దేశంలో 1,050 వర్సిటీలున్నా.. అందరికీ అందులో సీట్లిచ్చే అవకాశాల్లేవన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత స్టూడెంట్లకు ఇబ్బందవుతోందని, చదవాలనుకున్నా చదువుకునే పరిస్థితులు వారికి ఉండకపోవచ్చని చెప్పారు. అందుకే ఆన్​లైన్​ చదువుల ద్వారా అలాంటి వాళ్ల ఇంటి వద్దకే వర్సిటీలను తీసుకెళ్లాలని అనుకుంటున్నామని తెలిపారు.

ఎన్​ఆర్​ఐఎఫ్​ ర్యాంకింగ్స్​లో 100 లోపు, న్యాక్​ గ్రేడ్​ 3.0 ఉండే యూనివర్సిటీలు, కాలేజీలను ఎంపిక చేశామన్నారు. ఈ డిగ్రీకి కేవలం ఇంటర్​ ఉంటే చాలని, పాస్​ పర్సంటేజ్​తో సంబంధం లేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి వర్సిటీలు, కాలేజీల్లో ఆన్​లైన్​ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఆదివారం ఆయన ‘వీ6 వెలుగు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
డిగ్రీ స్టూడెంట్లకు అవకాశాలు ఉండట్లే..
ఇంజనీరింగ్​, మెడిసిన్​, ఇతర ప్రొఫెషనల్​ కోర్సులు చేసినోళ్లకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. 70 శాతం ఉన్న డిగ్రీ స్టూడెంట్లకు ఉద్యోగాలు రావడం గగనమవుతోంది. అలాంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేందుకే డ్యుయల్​ డిగ్రీ కోర్సులను తీసుకొచ్చాం. అందులో భాగంగా ఉదయం ఒక డిగ్రీ, సాయంత్రం మరో డిగ్రీ చదువుకునే వెసులుబాటు ఉంటుంది. లేదా ఒక డిగ్రీని క్లాసులో.. మరో డిగ్రీని ఆన్​లైన్​లో చదువుకోవచ్చు. అదీ కాదంటే రెండు డిగ్రీలను ఒకేసారి ఆన్​లైన్​లో చదువుకునే వీలు కూడా ఉంటుంది.  
ఐఐటీ, ఎన్​ఐటీల్లాగా డిజిటల్​ వర్సిటీ
ఐఐటీ, ఎన్​ఐటీల్లాగానే నేషనల్​ డిజిటల్​ యూనివర్సిటీని తీసుకురాబోతున్నాం. ఇంజనీరింగ్​, మెడిసిన్​, ప్రొఫెషనల్​ కోర్సులు తప్ప దేశ విదేశాల్లోని డిజిటల్​ కోర్సులన్నీ ఈ వర్సిటీలో అందుబాటులో ఉంటాయి. కొత్త యూనివర్సిటీలు కట్టాలంటే భారీగా నిధులు కావాల్సి ఉంటుంది. పైగా 60% ఉద్యోగాలకు చాలా సంస్థలు డిగ్రీ పట్టాలను లెక్కలోకి తీసుకోవట్లేదని సర్వేలే చెప్తున్నాయి. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా డిజిటల్​ యూనివర్సిటీని తీసుకొస్తున్నాం. ఫిజికల్​ డిగ్రీ, ఓపెన్​ డిగ్రీకి ఎలాంటి తేడా లేదు. ఈ విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. నాణ్యమైన చదువు చెప్తారు.  
వర్సిటీల్లో 35% ఖాళీలు
దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో 35 శాతం ఖాళీలున్నాయి. ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ కాబట్టి.. ఎప్పుడూ 100 శాతం భర్తీ చేయలేం. మంచి అర్హతలున్న లెక్చరర్ల కోసం పీహెచ్​డీ రీసెర్చ్​ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. టీచర్లు తక్కువున్నా డిజిటల్​ యూనివర్సిటీ ద్వారా లక్షలాది మందికి మంచి విద్యను అందించేందుకు అవకాశం ఉంటుంది. 
సొంత భాషలో చదువులు
ఇంగ్లీష్​ అన్నది కేవలం కమ్యూనికేషన్​కోసం వాడే భాష. సొంత భాషలో చదువుకుంటే సబ్జెక్ట్​తో పాటు క్రియేటివిటీ కూడా పెరుగుతోంది. నోబెల్​ వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది పీహెచ్​డీ వరకు సొంత భాషలో చదువుకున్నోళ్లే. సొంత భాషలో చదువు చెప్పడాన్ని యూనివర్సిటీలకు ఎలా అప్లై చేయాలన్నదానిపై ఆలోచిస్తున్నాం. 10 ఇంజనీరింగ్​ కాలేజీల్లో సొంత భాషలో కోర్సులను చెప్పేందుకు ఇప్పటికే ఓకే చెప్పాం" అని జగదీశ్​ కుమార్​ అన్నారు.  
నేను పక్కా తెలంగాణ 
‘‘నేను పక్కా తెలంగాణ బిడ్డను. మాది నల్గొండ జిల్లా నకిరేకల్​కు దగ్గర్లోని మామిడాల. ఆ ఊరి పేరే మా ఇంటి పేరైంది. ఆ రోజుల్లో చదువుకోవడం చాలా కష్టంగా ఉండేది. మా నాన్న నన్ను అప్పులు చేసి చదివించారు. రూ.10 ట్యూషన్​ ఫీజు కోసం అప్పు తెచ్చి కట్టేవారు. ఊర్లో పీహెచ్​డీ చేసిన ఫస్ట్​ వ్యక్తిని నేనే. మా అమ్మానాన్న కష్టం, ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. మా ఊర్లో వందేండ్ల నాటి మా ఇల్లు ఇప్పటికీ ఉంది. నేను ఊరికి వెళ్తే అందరూ వచ్చి మాట్లాడతారు’’ అని జగదీశ్​ కుమార్​ చెప్పారు.
ఒక్కటే సబ్జెక్ట్​ వద్దు
‘‘పదేండ్ల తర్వాత ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. కాబట్టి విద్యార్థులకు ఒకే సబ్జెక్ట్​పై ట్రైనింగ్​ ఇవ్వకూడదు. మల్టిపుల్​ సబ్జెక్టుల్లో విషయ జ్ఞానం ఉండేలా తీర్చిదిద్దాలి. అలాగైతే పదేండ్ల తర్వాత ఎలాంటి ఉద్యోగాలున్నా.. బేసిక్​ ట్రైనింగ్​తో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి మారాలి. లేదంటే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే జీవితాంతం లెర్నర్స్​గానే ఉండాలంటూ కొత్త ఎడ్యుకేషన్​ పాలసీ చెప్తోంది. ఉద్యోగం చేస్తూనే అన్ని విషయాలనూ నేర్చుకోవాలి.  

 

ఇవి కూడా చదవండి

మన రక్తంలో మైక్రో ప్లాస్టిక్‌‌!

దరఖాస్తులు క్లియరైనా నిధులు విడుదల​ చేస్తలె

‘‘ఏం జరిగినా నేను చూస్కుంటా’’ అంటూ రెచ్చగొడుతున్న సుమన్