యూనివర్సిటీలా? వ్యాపార సంస్థలా?

ఏ సర్కారు యూనివర్సిటీకైనా లాభాపేక్ష లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడమే తొలి లక్ష్యం. కానీ, నేడు ప్రభుత్వ యూనివర్సిటీలు అడ్డగోలుగా ఫీజులు పెంచేసి కరోనా కష్టకాలంలో రోజు గడిపేందుకే ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి జనాలపై పెనుభారం మోపుతున్నాయి. పైగా రకరకాల కారణాలు చెపుతూ ఇష్టానుసారం జనాల నుంచి పైసలు  వసూలు చేస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలోకి రావాలంటే ఎంట్రీ ఫీజు కట్టాలంటూ ఆదేశాలు జారీ చేయడం ఈ కోవలోనిదే. మరోవైపు వాణిజ్య అవసరాలకు యూనివర్సిటీల భూములను పరాయివారికి కట్టబెడుతున్నారు. వాటిల్లో కోట్ల వ్యాపారాలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు.. యూనివర్సిటీలకు మాత్రం నామమాత్రంగా లీజు చెల్లిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇవి యూనివర్సిటీలా? లేదంటే వ్యాపార కేంద్రాలా? అన్న అనుమానం కలుగుతోంది.

నాటి వందేమాతరం ఉద్యమం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసింది యూనివర్సిటీలే. ఉద్యమకారులను తమ ఒడిలో చేర్చుకొని వారికి దిశానిర్దేశం అందించాయి. వందేండ్లలో ఎంతో మంది విద్యావేత్తలు, రాజకీయ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ లు, అనేక రంగాల ప్రముఖులను ప్రపంచానికి అందించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ సొంతం. కానీ నేడు రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నీ పాడుబడ్డ భవనాలు, సరైన సౌలతులు, సరిపడా ఫ్యాకల్టీ లేక, అభివృద్ధికి నిధులు అందక వెలవెలబోతున్నాయి. ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని యూనివర్సిటీలను పట్టించుకోలేదని, అన్యాయం చేశారని చెప్పిన నాయకులు.. ఇప్పుడు స్వరాష్ట్రంలో చేస్తున్నదేమిటి? ఉస్మానియాను ఆక్స్​ఫర్డ్, కాకతీయను కేంబ్రిడ్జ్​ చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఎటుపోయాయి.
 

అడ్డగోలుగా ఫీజుల పెంపు

నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వ యూనివర్సిటీలు విద్యా వ్యాపారానికి తెరలేపుతూ ఫీజులను దారుణంగా పెంచేశాయి. కొత్తగా వచ్చిన వైస్​ చాన్స్​లర్లు(వీసీలు) ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికి విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం ఎజెండాను విద్యార్థులపై రుద్దుతున్నారు. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ కోర్సుల ఫీజులను భారీ మొత్తంలో పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పేద, మధ్యతరగతి వర్గాలకు అన్యాయం చేయడమే. ముఖ్యంగా వందేండ్ల చరిత్రగల ఉస్మానియా వర్సిటీలో ఎంఏ(ఆర్ట్స్, సోషల్ సైన్స్) రెగ్యులర్ కోర్సుల ఫీజును రూ.2,800 నుంచి రూ.14,000 వరకు,సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ల ఫీజులను రూ.3,800 నుంచి రూ.21,000కు పెంచేశారు. ఎంకాంకు రూ.30,000, ఎంబీఏకు రూ.35,000, ఎమ్మెస్సీ సైన్స్ కోర్సు ల ఫీజులను రూ.3,800 నుంచి రూ.20,490,సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజును రూ.35,000 పెంచారు. ఇంజనీరింగ్ కోర్స్ ఫీజులను అయితే దాదాపు రెట్టింపు పెంచేశారు. గతంలో రూ.18,000 ఉండగా ఇప్పుడు రూ.35,000 చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకైతే రూ.75,000 వరకు పెంచారు. ఇక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఫీజు అయితే ఏకంగా రూ.1,20,000 చేశారంటే ఏవిధంగా వసూళ్లు చేస్తున్నారో అర్థమవుతుంది. 
 

ప్రైవేటు వర్సిటీలుగా మారుస్తున్నరు

జేఎన్టీయూ హెచ్​లో ఇంకా దారుణంగా ఫీజులను దండుకోవాలని సాధారణ సీట్లను కూడా సెల్ఫ్ ఫైనాన్స్ గా మార్చి దోపిడీకి తెరలేపారు. కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ ఇలా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుకుని విద్యార్థులను దోచుకోవడమే లక్ష్యంగా మార్చుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోమన్నదని చెబుతున్న అధికారులు.. ప్రభుత్వ వర్సిటీను ప్రైవేట్ యూనివర్సిటీలుగా మార్చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోంది. ఇదే అదనుగా వర్సిటీలు ఇష్టానుసారం ఫీజులను పెంచడం వల్ల మెరిట్ ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు వర్సిటీ విద్య దూరమవుతోంది. ఫీజులు పెంచి వర్సిటీల్లో సౌలతులను పెంచుతామని వీసీలు చెబుతున్న మాటలు సరికాదు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి అప్పుడు వర్సిటీల్లో సౌకర్యాలను మెరుగుపరచాలి. అంతేకానీ విచ్చలవిడిగా ఫీజులు పెంచడం సరి కాదు. మరోవైపు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్న ముఖ్యమంత్రి మాటలు వాస్తవరూపం దాల్చలేదు. ఉచిత విద్య కాదు కదా కేజీ టూ పీజీ వరకు ఫీజుల మోత మోగిపోతోంది. ఇష్టానుసారం ఫీజులు పెంచి విద్యార్థులపై భారం వేస్తామంటే సహించేది లేదు. పెంచిన పీజీ, ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులను వెంటనే వెనక్కి తీసుకోవాలి.
 

హాస్టళ్లలో సౌలతులు లేవు

ఒకవైపు ఫీజులను ఇష్టానుసారం పెంచినా క్యాంపస్​ హాస్టళ్ల పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో చేరే వారిలో 70 శాతం మందికిపైగా విద్యార్థులు గ్రామీణ నేపథ్యం ఉన్న వారే. వీరంతా కష్టపడి చదివి క్యాంపస్ కు వస్తారు. తీరా వర్సిటీకి వచ్చాక హాస్టల్స్ పరిస్థితి చేస్తే అరకొర వసతులే ఉంటున్నాయి. ఇద్దరు ఉండాల్సిన రూంలో ఆరుగురు, ముగ్గురు ఉండాల్సిన రూమ్స్ లో పది మందిని కుక్కుతున్న పరిస్థితి. విద్యార్థుల సంఖ్యకు హాస్టల్స్ కెపాసిటీకి పొంతనే ఉండదు. బాత్ రూమ్స్, టాయిలెట్స్ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేవు. నాణ్యమైన ఆహారం అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం. వందేండ్ల ఓయూలో వసతులు లేక విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేస్తున్నా.. వర్సిటీ అధికారులకు కనిపించకపోవడం సిగ్గుచేటు. యూనివర్సిటీ మెస్ లోకి అడుగుపెట్టకముందే డిపాజిట్ల పేరుతో వేల రూపాయలు వసూళ్లు చేస్తుంటే.. అసలు ఇది ప్రభుత్వ వర్సిటీలా లేక ప్రైవేట్ విద్యా సంస్థలా అనే సందేహం రాక మానదు. మెరిట్ విద్యార్థులకు వర్సిటీలో సీటు వస్తే ప్రభుత్వమే ఉచిత విద్య అందించాల్సింది పోయి డిపాజిట్ పేరుతో వేల రూపాయలు వసూళ్లు చేయడం దారుణం. అందువల్ల హాస్టల్ మెస్​ల్లో డిపాజిట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. విద్యార్థులకు సరిపడా కొత్త హాస్టల్స్ నిర్మించి మెరుగైన వసతులు కల్పించాలి.
 

వర్సిటీల్లో వెక్కిరిస్తున్న ఖాళీలు


రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో దాదాపు 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల ఖాళీలతో వర్సిటీలు పూర్తిగా కుంటుపడ్డాయి. ప్రొఫెసర్లు లేని కారణంగా పరిశోధనలు జరగడం లేదు. విద్యా ప్రమాణాలు, బోధన నాణ్యత పడిపోయిన పరిస్థితి. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో మొత్తం 2,979 పోస్టులు ఉండగా వాటిలో 827 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా 2,152 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయిన వారితో ఖాళీలు ఇంకా పెరిగాయి. అధ్యాపకేతర పోస్టులైతే వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నా పట్టించుకోని పరిస్థితి. నాన్ టీచింగ్ స్టాఫ్ లేని కారణంగా ఉన్న కొద్దిమంది ఉద్యోగులపైనే పని ఒత్తిడి పెరిగి అనేక తప్పిదాలు జరుగుతున్నాయి. ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. యూనివర్సిటీల సమస్యలను గాలికి వదిలి ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం కోసం వీసీలు ప్రయత్నాలు చేస్తున్నారు. యూనివర్సిటీల మనుగడ ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలను మానుకోవాలి. వర్సిటీల ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మానుకుని వర్సిటీలకు సరిపడా నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి దోహదపడాలి.

ఇష్టానుసారంగా పైసల వసూళ్లు 


మరోవైపు ఉస్మానియా వర్సిటీలో మరింత చిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. యూనివర్సిటీని అమ్మకానికి పెట్టినట్లుగా పాస్ పెట్టి మరి వసూళ్లు చేస్తున్నారు అధికారులు. యూనివర్సిటీలోకి వచ్చే వాకర్లకు కార్డులు ఇచ్చి నెలకు ఇంత మొత్తం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడాన్ని ఏమనుకోవాలి. మరోవైపు యూనివర్సిటీ భూములను ఇష్టానుసారం ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగిస్తున్నారు. వర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కానీ సంస్థలకు గానీ కేటాయించరాదని గతంలోనే జస్టిస్ చిన్నపరెడ్డి కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. అయితే అధికారులు మాత్రం కమిటీల ఆదేశాలను తుంగలో తొక్కి వర్సిటీ భూములను లీజుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు.
- పి.శ్రీహరి, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్