యూనివర్సిటీల భూములు కబ్జాలైతున్నయ్

యూనివర్సిటీలే కేంద్రాలుగా, స్టూడెంట్లు, నిరుద్యోగుల ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం వచ్చాక తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆశపడ్డాం. అలాగే రాష్ట్రంలో ఉన్నత విద్య మెరుగుపడి యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతాయని ఆశించాం. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా విద్యా రంగం  పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ముఖ్యంగా ఉద్యమానికి వేదికలుగా నిలిచిన యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్రను టీఆర్ఎస్  ప్రభుత్వం చేస్తోంది. యావత్ విద్యార్థి లోకం చేసిన అనేక ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి యూనివర్సిటీలకు వైస్ చాన్స్​లర్లను నియమించింది. అయితే ఈ నియామకాలు పూర్తిగా యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్(యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. యూజీసీ నియమాలను సైతం పక్కనపెట్టి టీఆర్ఎస్​ పార్టీ అనుకూల వ్యక్తులను, పైరవీకారులను వీసీలుగా నియమించారు. ఇది యూనివర్సిటీల ప్రతిష్టను దిగజార్చడమే. ఉన్నత విద్య అందిస్తూ సమాజానికి ఉన్నత స్థాయి వ్యక్తులను అందించే యూనివర్సిటీలకు పైరవీకార్లను వీసీలుగా నియమించడం ద్వారా వాటి ప్రతిష్టను దెబ్బతీయడమే కాక వర్సిటీల స్వయం ప్రతిపత్తిని కేసీఆర్ ఫాంహౌస్ కు తాకట్టు పెట్టినట్టు అయ్యింది. ఇక టీచింగ్, నాన్​ టీచింగ్​ ఖాళీలు మొదలుకుని భూముల కబ్జాల వరకూ ఎన్నో సమస్యలతో యూనివర్సిటీలు సతమతమవుతున్నాయి.
యూనివర్సిటీల్లో 75 శాతం ఖాళీలే 
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో దాదాపు 75 శాతం టీచింగ్, నాన్​ టీచింగ్​ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీల్లో పాలన గాడి తప్పింది. లెక్చరర్లు, ప్రొఫెసర్లు లేక విద్యా ప్రమాణాలు, బోధన నాణ్యత పడిపోయింది. పరిశోధన చేసే స్టూడెంట్లకు సరైన  గైడెన్స్​ ఇచ్చే వారు లేరు. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలో మొత్తం 2,979 పోస్టులు ఉండగా, అందులో 2,152 పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీలో 955 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో 304, జేఎన్టీయూ 255, మహాత్మా గాంధీ 114, తెలంగాణ 75, పాలమూరు 123, అంబేద్కర్​ 48, తెలుగు వర్సిటీ 95, జేఎన్ఏయఫ్ఏయూలో 87 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయిన వారిని కూడా లెక్కిస్తే ఖాళీలు ఇంకా పెరిగాయి. నాన్​ టీచింగ్​ పోస్టులైతే వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నా పట్టించుకోని పరిస్థితి. నాన్ టీచింగ్ స్టాఫ్ లేని కారణంగా ఉన్న కొద్ది మంది ఉద్యోగులపైనే పని ఒత్తిడి పెరుగుతోంది. యూనివర్సిటీల్లో దాదాపు 10 సంవత్సరాలుగా నియామకాలు లేవు. 2017లో 1,061 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అవి భర్తీకి నోచుకోలేదు. మొత్తం అన్ని యూనివర్సిటీల్లో కలిపి 2,979  టీచింగ్​ స్టాఫ్​ ఉండాల్సి ఉండగా 827 మందే పనిచేస్తున్నారు. ఇలా అయితే యూనివర్సిటీలు ఎలా నడుస్తాయి. పేద స్టూడెంట్లకు నాణ్యమైన ఉన్నత విద్య ఎలా లభిస్తుంది. లెక్చరర్లు, ప్రొఫెసర్లు లేని కారణంగా యూనివర్సిటీల్లో కొన్ని డిపార్ట్​మెంట్సే మూతపడిన పరిస్థితి. సీనియర్ ప్రొఫెసర్లు లేని కారణంగా పరిశోధన పూర్తిగా కుంటుపడింది. కొత్త స్టూడెంట్లు రావడం లేదు. అందువల్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మాని టీచింగ్, నాన్​ టీచింగ్​ స్టాఫ్​ను భర్తీ చేసి యూనివర్సిటీలను కాపాడాలి. అనేక సమస్యలతో వర్సిటీలు సతమతమవుతున్న తరుణంలో పైరవీకారులను వీసీలుగా నియమించడం దారుణం. తూతూమంత్రంగా వీసీలను నియమించి చేతులు దులుపుకోవడం కాకుండా వర్సిటీల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలి. అన్ని అర్హతలు, విజన్ ఉన్న వారిని వీసీలుగా నియమించాలి.
సమస్యల సుడిగుండంలో వర్సిటీలు 

వర్సిటీలు ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేయపడ్డాయి. కనీసం జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రం వచ్చాక కూడా యూనివర్సిటీలకు బడ్జెట్ లో మొండి చేయి చూపుతున్నారు. ఉన్న సిబ్బంది జీతాలు రాక ప్రతి నెలా ధర్నాలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర సాధనకు మూలమైన యూనివర్సిటీలకు నిధులు కేటాయించడంపై ప్రభుత్వం చిన్నచూపు చూడడం దారుణం. యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి. ఇక వర్సిటీల హాస్టల్​ బిల్డింగ్స్​ భూత్​ బంగ్లాలను తలపిస్తున్నాయి. హాస్టల్స్ లో కనీస సదుపాయాలు లేక స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడో నిజాం కాలంలో గుర్రాల కోసం నిర్మించిన రేకుల షెడ్స్ నే పీజీ స్టూడెంట్లకు హాస్టల్స్ గా ఇస్తున్నారు. ఎన్నిసార్లు పైకప్పు, గోడలు కూలినా తూతూమంత్రంగా మరమ్మతులు చేసి ఊరుకుంటున్నారు. వాటిలో బిక్కుబిక్కుమంటూ స్టూడెంట్లు రోజులు గడుపుతున్నారు. కరోనా కారణంగా హాస్టల్స్ అన్నీ మూతపడటంతో ఉన్నవి కూడా శిథిలావస్థలోకి వెళ్లాయి. అందువల్ల యూనివర్సిటీల్లో స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త హాస్టల్స్ ను నిర్మించాలి. ప్రభుత్వమే స్టూడెంట్ల మెస్ బిల్స్ ను భరించాలి. యూనివర్సిటీల భూములు కబ్జాలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంలో ఉన్న వారే కబ్జాలకు పాల్పడడం వల్ల ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి. యూనివర్సిటీ భూముల కబ్జాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కబ్జాకు గురైన భూములను యూనివర్సిటీలు తిరిగి స్వాధీనం చేసుకోవాలి. 
                                                                                                                                                                                                    - పి.శ్రీహరి,ఏబీవీపీ లీడర్​