
- వర్సిటీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టూడెంట్ల ఆందోళన
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మొద్దని స్టూడెంట్లు కోరారు. వెంటనే వేలం ఆపాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు గురువారం వర్సిటీలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్సిటీ భూములు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. హెచ్ సీయూకు చెందిన 400 ఎకరాలను 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎకరానికి రూ.50 వేల చొప్పున ఓ స్పోర్ట్స్ అకాడమీకి కేటాయించగా, సదరు అకాడమీ ఎలాంటి క్రీడా కార్యకలాపాలు నిర్వహించలేదన్నారు.
దీంతో ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోగా, అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోందని చెప్పారు. ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాగా, టీజీ ఐఐసీ ద్వారా వేలం వేసి సదరు భూమిని అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. వర్సిటీ భూమిలో వేలాది చెట్లు, పక్షులు, వివిధ రకాల జంతువులు, వందల సంవత్సరాల నాటి శిలలు(రాక్స్) ఉన్నాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. భూముల వేలాన్ని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో వందల మంది స్టూడెంట్లు పాల్గొన్నారు.