
- కాంట్రాక్ట్, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్న వారికే మార్కులు
- ఆందోళనకు సిద్ధమవుతున్న పార్ట్‌టైం లెక్చరర్లు
- ఈ నెల 17న చలో సెక్రటేరియట్‌కు పిలుపు
- పదేండ్ల బీఆర్‌ఎస్ హయాంలో కన్వర్షన్‌కు నోచుకోని వైనం
కరీంనగర్, వెలుగు : యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీని చేపట్టిన ప్రభుత్వం పార్ట్ టైం లెక్చరర్ల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కాంట్రాక్ట్, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేసే వారి సర్వీస్‌కు ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇస్తామన్న ఆఫీసర్లు.. పది, పదిహేనేండ్లుగాపనిచేస్తున్న పార్ట్‌టైం లెక్చరర్లకు మాత్రం మార్కులు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం లెక్చరర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17న చలో సెక్రటేరియట్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.
జీవో 21లో మార్పులు చేయాలని డిమాండ్
అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీలో పాటించే విధానంపై పార్ట్‌టైం లెక్చరర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పేరుకే పార్ట్ టైమ్ లెక్చరర్లమైనా.. తాము కూడా నెట్, సెట్, పీహెచ్‌డీ క్వాలిఫికేషన్స్‌తోనే వచ్చామని, కాంట్రాక్ట్, రెగ్యులర్ ప్రొఫెసర్లతో సమానంగా సమానంగా పాఠాలు చెబుతున్నామని, అయినా తమ సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ప్రైవేట్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ డిగ్రీ, పీజీ కాలేజీల్లో పనిచేస్తున్నవారికి కూడా మార్కులు కేటాయించిన ఆఫీసర్లు తమను మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు.
యూనివర్సిటీల్లో రోస్టర్ పాటిస్తూ ఇంటర్వ్యూ, డెమో, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ద్వారా సెలక్ట్ అయిన తమ సర్వీస్‌కు విలువ లేకుండా పోయిందంటున్నారు. ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 21లో మార్పులు చేయాలని ఇప్పటికే పలుమార్లు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డితో పాటు ఆయా యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లను కలిసి తమ గోడు చెప్పుకున్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో అన్యాయం
2014కు ముందు పార్ట్ లెక్చరర్ల ఫుల్ వర్క్ లోడ్ (16 పీరియడ్లు) కాగానే ఆటోమేటిక్‌గా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా కన్వర్ట్ అయ్యేవారు. లేదంటే రెండు, మూడేళ్లకోసారి ఒక బ్యాచ్‌గా కన్వర్ట్ చేసేవారు. అప్‌గ్రేడ్ పూర్తికాగానే నెలనెలా గౌరవప్రదమైన జీతంతో పాటు ఉద్యోగ భద్రత లభించేది. కానీ తెలంగాణ ఏర్పడి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ విధానానికి స్వస్తి పలికింది. దీంతో గత పదేండ్లలో సుమారు 500 మంది ఫుల్ వర్క్ లోడ్ కలిగిన పార్ట్ టైం లెక్చరర్లు కాంట్రాక్ట్ లెక్చరర్లుగా అప్‌గ్రేడ్ కాలేకపోయారు. ఫలితంగా ఇన్నాళ్లూ పనికి తగిన జీతం రాకపోవడమే గాక ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు సైతం వారి సర్వీస్ లెక్కలోకి రాకుండా పోయింది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పార్ట్ టైం లెక్చరర్ల జీవితాలు దుర్భరంగా మారాయి. నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలకు మించి జీతం రాని దుస్థితి నెలకొంది. దీంతో పార్ట్ టైం లెక్చరర్లకు రూ. 50 వేల జీతం ఇస్తామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఆ హామీ ఇప్పటివరకు అమలు కాలేదు. రిక్రూట్‌మెంట్ సంగతి ఎలా ఉన్నా.. పార్ట్ టైం లెక్చరర్లకు నెలకు రూ. 50 వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్వీస్ ర్యాటిఫికేషన్ లేకనే సమస్య
సాధారణంగా ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ, పీజీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తున్న లెక్చరర్ల సర్వీస్‌ను ప్రతి రెండు, మూడేళ్లకోసారి యూనివర్సిటీలోని ఆయా డిపార్ట్‌మెంట్ల హెడ్‌లు, బీఓఎస్ చైర్‌పర్సన్లు, రిజిస్ట్రార్ ర్యాటిఫై చేస్తుంటారు. ఈ ర్యాటిఫికేషన్‌తో ఆయా కాలేజీల లెక్చరర్లు ఏదైనా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు స్వీకరిస్తే తమ అర్హతను బట్టి వారు అప్లై చేసుకునే అవకాశముంది.
కానీ అదే యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హతతో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్ల సర్వీసుకు మాత్రం ర్యాటిఫికేషన్ లేకపోవడం గమనార్హం. దీంతో యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పార్ట్ టైం లెక్చరర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు కాంట్రాక్ట్ లెక్చరర్లు అప్లై చేసుకోలేకపోతున్నారు.