
- అడ్డుకున్న వర్సిటీ విద్యార్థులు
- భారీగా పోలీసుల మోహరింపు
- స్టూడెంట్లు అరెస్ట్.. మాదాపూర్ స్టేషన్ కు తరలింపు
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్యూనివర్సిటీ (హెచ్ సీయూ) లో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీలోని 400 ఎకరాల భూమిని చదును చేసేందుకు అధికారులు పెద్ద సంఖ్యలో జేసీబీలు, ట్రక్కులతో అక్కడికి చేరుకోగా, విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందుగా హెచ్‌సీయూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్టూడెంట్లు పెద్ద ఎత్తున ఈస్ట్ క్యాంపస్ వద్దకు చేరుకున్నారు.
సెలవు రోజు చూసుకొని 400 ఎకరాల అడవిని నాశనం చేస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు.. విద్యార్థులను ఈడ్చుకువెళ్లారు. మహిళా విద్యార్థినులను మహిళా పోలీసులు జుట్టుపట్టుకుని లాక్కెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. 52 మంది స్టూడెంట్లను అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళన చేపట్టిన తమను పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లడం ఏమిటని విద్యార్థులు మండిపడ్డారు. పోలీసుల దాడిలో పలువురు స్టూడెంట్లు గాయపడగా, మరికొందరు స్పృహతప్పి కింద పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
హెచ్‌సీయూ గేట్‌కు తాళం..
విద్యార్థులను ఆరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారన్న విషయం తెలుసుకున్న క్యాంపస్‌లోని మిగిలిన విద్యార్థులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. అయితే, మెయిన్ గేట్‌కు పోలీసులు తాళం వేసి స్టూడెంట్లు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు గేట్ తాళం తీశారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని స్టూడెంట్లు అక్కడే బైఠాయించారు.
హెచ్ సీయూకు చెందిన400 ఎకరాల జోలికి రావొద్దని, ఆ భూములను యూనివర్సిటీ పేరుపై రిజిస్ర్టేషన్ చేసివ్వాలన్నారు. హెచ్‌సీయూ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
భూములను అమ్మి పాలిస్తారా?: బండి సంజయ్
హెచ్‌సీయూలో నెలకొన్న వివాదాన్ని క్యాంపస్ విద్యార్థి సంఘాల నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులను లాక్కెళ్లి అరెస్ట్ చేశారని తెలిపారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ భూములను అమ్మి రాష్ర్టాన్ని పాలిస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భావితరాలకు గజం జాగా కూడా మిగల్చరా? అని అన్నారు. పోలీసుల ద్వారా భయాందోళనలకు గురిచేసి కాంగ్రెస్ పాలించాలని అనుకుంటోందన్నారు. సెంట్రల్ వర్సిటీ భూములకే రక్షణ లేకపోతే ఎలా? అని ఫైర్ అయ్యారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను తక్షణమే రిలీజ్ చేయాలని, హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.