కామారెడ్డి టౌన్, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ పోలీసులమంటూ ఫోన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కిషన్‌రావు అనే వ్యక్తికి సెప్టెంబర్ 26న గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ‘మేము ఢిల్లీ పోలీసులం.. నీ మీద డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులు నమోదు అయ్యాయి, నిన్ను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు వస్తున్నారు’ అని బెదిరించాడు. మర్నాడు మళ్లీ ఫోన్ చేసి అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేశారు.
కేసు క్లియర్ అయిన తర్వాత డబ్బులు తిరిగి పంపిస్తామని చెప్పాడు. నమ్మిన కిషన్‌రావు నాలుగు విడతలుగా రూ.9.29 లక్షలను గుర్తుతెలియని వ్యక్తి చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.