భద్రాచలంలో అర్ధరాత్రి హోటల్ ధ్వంసం... నిరసనకు దిగిన భాధితులు

కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ హోటల్ పై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన భద్రాచలం పట్టణంలో చోటుచేసుకుంది. స్థలం యజమాని, హోటల్ యజమాని మధ్య అగ్రిమెంట్ విషయంలో మాటలు నడుస్తుండగా.. జనవరి 26వ తేదీ శుక్రవారం రాత్రి కావేరి హోమ్ ఫుడ్స్ హోటల్ ను దుండగులు ధ్వంసం చేశారు.  

రెస్టారెంట్ ఓనర్స్ కొండారెడ్డి, రమ్యశ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న రాత్రి హోటల్ ను బంద్ చేసి ఇంటికి వెళ్లిన తర్వాత సుమారు 50 మందికి పైగా గూండాలు వచ్చి, తాళాలు బద్ధలుకొట్టి హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు చెప్పారు. దీంతో తమకు సుమారు 15 లక్షల రూపాయల ఆస్థి నష్టం వాటిల్లిందని, మాకు న్యాయం చేయాలంటూ హోటల్ ముందు నిరసనకు దిగారు. వీరికి భద్రాచలం హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, వాసు, మధువన్ రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. న్యాయం జరిగే వరకూ భద్రాచలం పట్టణంలోని హోటల్స్ బంద్ కు పిలుపునిచ్చారు.