రూ.కోటితో కట్టి ఖాళీగా పెట్టిన్రు .. నిరుపయోగంగా మెడికల్ డయాగ్నసిస్​​ ​బిల్డింగ్

  • ఏడాది కింద ఓపెన్ చేసి వదిలేసిన సింగరేణి అధికారులు        
  • నిరుపయోగంగా మెడికల్ డయాగ్నసిస్​​ ​బిల్డింగ్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్​లో రూ.కోటి పెట్టి నిర్మించిన డయాగ్నసిస్​ బిల్డింగ్, కాన్ఫరెన్స్​ హాళ్లను అధికారులు ఖాళీగా ఉంచారు. ప్రారంభించి ఏడాదవుతున్నా వాడుకోవడం లేదు. కారుణ్య నియామకాల్లో భాగంగా ఇక్కడ మెడికల్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు. ఎలాంటి మెడికల్​టెస్టులు చేయడం లేదు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్​ జిల్లాల్లోని కోల్ బెల్ట్ ఏరియాల కార్మికులు, వారి వారసులు మెడికల్​బోర్డు ఇంటర్వ్యూల కోసం కొత్తగూడెం మెయిన్​హాస్పిటల్​కు రావాలి. ప్రతి నెలలో120 నుంచి 200 మంది వరకు ఇక్కడికి వస్తుంటారు.

ఒక్కోసారి నెలలో రెండుసార్లు కూడా ఇంటర్వ్యూలు పెడుతుంటారు. మెడికల్ బోర్డు ఇంటర్వ్యూల టైంలో మెయిన్ హాస్పిటల్ లోకి ఇతరులను ఎక్కువగా అనుమతించరు. ఈ క్రమంలో సాధారణ పేషెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, హాస్పిటల్​ఆవరణలోనే కోటి రూపాయలతో డయాగ్నసిస్​​ బిల్డింగ్ ​నిర్మించారు. అందులో ప్రత్యేకంగా రూమ్స్, కాన్ఫరెన్స్​హాళ్లు కట్టారు.

ముఖ్యమైన రూమ్స్​కు ఏసీలు బిగించి, అన్నిరకాల సౌకర్యాలు కల్పించారు. గతేడాది సింగరేణి డైరెక్టర్​ఎస్. చంద్రశేఖర్ ప్రారంభించగా, అప్పటి నుంచి ఖాళీగానే పెట్టారు. నేటికీ మెడికల్ ​టెస్టులు, ఇంటర్వ్యూలను మెయిన్​హాస్పిటల్​లోని షెడ్డులోనే నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న బిల్డింగ్​ను వాడుకోకుండా, పాత పద్ధతినే కొనసాగించడంపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.