
- గ్రామాల్లో అర్హతకు మించి వైద్యంతో ప్రాణాలతో చెలగాటం
- ఇటీవల పీఎంపీ నిర్వాకంతో బాలికకు అబార్షన్
- రెండు రోజులు హడావుడి చేసి పలు క్లినిక్ లు సీజ్
- దొరికిందే అదునుగా మాస్ మీడియా అధికారి చేతివాటం
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఆరోగ్య శాఖ అబాసుపాలవుతోంది. జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్, గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్ లపై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తప్ప అధికారులకు తనిఖీలు గుర్తుకురావడం లేదు. ఫలితంగా గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలు మీదకు తెస్తున్నారు. ఇక పట్టణాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అందిన కాడికి దోచుకుంటూ కోట్లు గడిస్తున్నారు. ప్రైవేట్ దోపిడీపై ఫోకస్ పెట్టని ఆరోగ్యశాఖ కాస్తా అనారోగ్య శాఖగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఎంఈవో
ఇటీవల గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్‌కు చెందిన ఓ బాలిక గర్భం దాల్చగా ఆమెకు పీఎంపీ అబార్షన్ గోలీలు ఇచ్చాడు. దీంతో బాలికకు అబార్షన్ కాగా.. చనిపోయిన శిశువును ఊరి బయట వాగులో పడేసింది. స్థానికుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పీఎంపీపై కేసు నమోదు చేసి క్లినిక్‌ను సీజ్ చేశారు. అయితే క్లినిక్‌ను సీజ్ చేసిన జిల్లా మెడికల్ఎక్స్టెన్షన్ ఆఫీసర్రవిశంకర్.. దానికి అనుబంధంగా ఉన్న అబార్షన్ ముందులు ఇచ్చిన మెడికల్ షాపు నిర్వహకుడిని కేసు నుంచి తప్పించేందుకు బేరం కుదుర్చుకున్నాడు.
రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తనిఖీల పేరిట క్లినిక్‌లు, హాస్పిటల్స్ యాజమాన్యాల నుంచి మామూళ్లు వసూలు చేస్తన్నారని వస్తున్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు బలాన్ని చేకూరుస్తు న్నాయి. వైద్యారోగ్యశాఖ సమర్థంగా పనిచేయకపోవడం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
ఇష్టారీతిన వైద్యం..
గ్రామాల్లో కొంత మంది ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇష్టారీతిన వైద్యం అందిస్తున్నారు. వారి అర్హతకు మించి వైద్యం చేస్తున్నారు. క్లినిక్‌లు ఏర్పాటు చేసుకొని అనుమతులు లేకున్నా వాటికి అనుబంధంగా ల్యాబ్స్, మెడికల్‌షాపులు నిర్వహిస్తున్నారు. వచ్చీరాని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫస్ట్‌ఎయిడ్ మాత్రమే అందించాల్సిన వారు.. నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల ట్రీట్మెంట్ చేస్తున్నారు.
అర్హత లేకున్నా ఇటు వైద్యం.. అటు ల్యాబ్స్‌లో పరీక్షలు చేస్తున్నారు. క్లినిక్‌లలో ప్రిస్కిప్షన్ సైతం రాసి ఆ మందులు ఎక్కడా దొరకవని, పక్కన వారు ఏర్పాటు చేసుకున్న మెడికల్ షాపుల్లోనే తీసుకోవాలంటూ రోగులకు చెబుతున్నారు. గ్రామాల నుంచి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులను తరలిస్తూ కమీషన్లు దండుకుంటున్నారు. ఇదంతా నిత్యం జరుగుతున్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
జిల్లా కేంద్రంలోనూ అదే పరిస్థితి..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ వెలుస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా వీటికి అనుబంధంగా డయాగ్నస్టిక్స్, ల్యాబ్స్, మెడికల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇష్టారీతిన వేలకువేలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల తాంసి బస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్స్‌కు అత్యవసర సమయంలో ఓ రోగిని తీసుకెళ్తే.. డబ్బులు కట్టనిదే అడ్మిట్ చేసుకోమని రోగుల బంధువులను బయటే ఉంచారు. ఇలా కొంత మంది ధనార్జనే ధ్యేయంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు దృష్టి పెట్టడంలేదు. గతేడాది కలెక్టర్ రాజర్షి షా ప్రైవేట్ హాస్పిటల్స్‌ను స్వయంగా తనిఖీ చేశారు.
దీంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వారం రోజుల పాటు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిబంధనలు పాటించని 70 హాస్పిటల్స్‌ను తనిఖీలు చేసి ఏకంగా 30 ఆస్పత్రులకు నోటీసులు అందించారు. అయితే సదరు హాస్పిటల్స్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయా.. లేదా అనే విషయాన్ని ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. కొంత మంది రాజకీయ నాయకుల ఒత్తళ్లతోనూ పలుమార్లు తనిఖీలు నిలిచిపోయిన సందర్భాలున్నాయి.