
మనకు ఒక సంవత్సరం గడవాలంటే 365 రోజులు పూర్తవ్వాలి. కానీ.. 30 గంటల్లోనే ఈ గ్రహం మీద ఒక సంవత్సరం పూర్తవుతుంది. అదెలాగంటారా.. ఇది 1.3 రోజులోనే దాని కక్ష్యను పూర్తి చేస్తుంది. ఈ మధ్యే సైంటిస్ట్‌లు ఈ గ్రహ నిర్మాణాన్ని త్రీడీలో రూపొందించారు. దానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పప్పిస్ నక్షత్ర సముదాయంలో దాదాపు 900 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డబ్ల్యూఏఎస్పీ –121 బీ అనే గ్రహం మీద సైంటిస్ట్‌లు కొన్నాళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ రూపొందించిన వెరీ లార్జ్ టెలిస్కోప్ (వీఎల్టీ)లోని నాలుగు పెద్ద టెలిస్కోప్ యూనిట్ల ద్వారా తెలుసుకున్న అంశాల ఆధారంగా మొదటిసారిగా త్రీడీ మ్యాప్ని రూపొందించారు. దాని ప్రకారం.. డబ్ల్యూఏఎస్పీ –121 బీ గ్రహం భూమితో పోల్చితే తన కక్ష్యలో చాలా వేగంగా తిరుగుతోంది. దాని హోస్ట్ స్టార్‌కి చాలా దగ్గరగా తిరగడం వల్ల చాలా వేడిగా ఉంది. అందుకే దీన్ని సైంటిస్ట్‌లు ‘‘అల్ట్రా-హాట్ బృహస్పతి’’గా పిలుస్తున్నారు.
అంతేకాదు.. ఇది దాని నక్షత్రానికి అత్యంత దగ్గరగా ఉండడం వల్ల టైడల్ లాక్ అయ్యింది. అంటే ఒక వైపు నిరంతరం పగలు, మరొక వైపు చీకటి ఉంటుంది. పగటి వైపు దాదాపు 4,900 డిగ్రీల ఫారెన్‌హీట్ (2,700 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాత్రి వైపు 2,200 డిగ్రీల ఫారెన్‌హీట్ (1,250 డిగ్రీల సెల్సియస్) ఉంటుంది.
పరిశోధకులు చిలీలోని టెలిస్కోప్‌లను ఉపయోగించి ఈ గ్రహంపై మూడు విభిన్న వాతావరణ పొరలను కనుగొన్నారు. ప్రతి దానిలో వేర్వేరు రసాయన మూలకాలు ఉన్నాయి. కింది పొరలో ఆవిరి రూపంలోని ఐరన్ సమృద్ధిగా ఉంది. మధ్య పొరలో సోడియం ఉంటుంది. పై పొరలో హైడ్రోజన్ ఉంటుంది. సైంటిస్ట్‌లు ఇందులో టైటానియం వాయువును కూడా కనుగొన్నారు. ఇది ఎక్సోప్లానెట్ వాతావరణంలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.