- కిర్గిస్తాన్‌లోని మన స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వం సూచన
- ఆ దేశంలో అల్లర్ల నేపథ్యంలో అలర్ట్
న్యూఢిల్లీ : కిర్గిస్తాన్ దేశంలో అల్లర్లు చెలరేగాయి. విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని స్థానిక విద్యార్థులు దాడులకు తెగబడ్డారు. కిర్గిస్తాన్, ఈజిప్ట్‌కు చెందిన స్టూడెంట్ల మధ్య ఈ నెల 13న జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో శుక్రవారం వైరల్ కావడంతో హింస చెలరేగింది. కిర్గిస్తాన్‌లోని భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విద్యార్థులు నివసించే దేశ రాజధాని బిష్కెక్లోని యూనివర్సిటీ హాస్టల్స్‌పై స్థానిక విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్తాన్ స్టూడెంట్స్ మృతిచెందినట్టు , మరికొంత మందికి గాయాలైనట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లుకొట్టింది. దీంతో భారత సర్కారు అప్రమత్తమైంది. ఆ దేశంలో ఉన్న మన స్టూడెంట్లను అప్రమత్తం చేసింది. హాస్టళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని అక్కడి ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. దాడులకు పాల్పడుతున్నవారిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుంటున్నాయని, పరిస్థితి కంట్రోల్లోకి వస్తోందని తెలిపింది. కాగా, ఇండియన్ స్టూడెంట్లుఅందరూ భారత ఎంబసీతో టచ్‌లో ఉండాలని విదేశాంగ మంత్రి జైశంకర్ సూచించారు.
బిష్కెక్లో ఏం జరుగుతోంది?
కిర్గిస్తాన్, ఈజిప్ట్ విద్యార్థుల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 13 న విదేశీ విద్యార్థులకు, స్థానిక కిర్గిజ్ విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కిర్గిజ్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హింస చెలరేగింది. విదేశీ విద్యార్థులను టార్గెట్
చేసి స్థానిక విద్యార్థులు దాడులు చేస్తున్నారు.