భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన .. చేతికొచ్చిన పంట నేల పాలు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన .. చేతికొచ్చిన పంట నేల పాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో  అకాల వర్షాలకు, గాలి దుమారానికి చేతికొచ్చిన పంట నేల పాలైంది. పలుచోట్ల పండ్ల తోటలు, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో దాదాపు 250కిపైగా ఎకరాల్లో మామిడి, ఏడు ఎకరాల్లో అరటి తోటలకు నష్టం కలిగింది. సుమారు రూ.50 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలల్లో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటలను కౌలుకు తీసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.  

తీవ్రంగా నష్టపోయాం.. 

ఐదు ఎకరాల్లో మామిడి తోటలను కౌలుకు తీసుకున్నాను. ఏడాదికి రూ. 3.50లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నా. మొదట్లో పూత బాగా రావడంతో ఆనందపడ్డాను. వాతావరణంలోని మార్పులతో పూత రాలింది. పూత, పిందెను కాపాడుకునేందుకు మందులు కొట్టాను. చేతి కొచ్చే టైంలో గాలివానకు కాయలు నేలరాలాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. 

బి. పల్లంశెట్టి, మామిడి తోటను కౌలు రైతు

అంచనా వేస్తున్నాం.. 

అకాల వర్షాలు, గాలి దుమారాలతో మామిడి తోటల్లో ఏర్పడిన నష్టంపై అంచనా వేస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 255 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం కలిగింది. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తాం. 

కిషోర్, హార్టి కల్చర్​ ఆఫీసర్​