అకాల వర్షం ఆగం జేసే..దెబ్బతిన్న వందల ఎకరాల మామిడి తోటలు

అకాల వర్షం ఆగం జేసే..దెబ్బతిన్న వందల ఎకరాల మామిడి తోటలు
  • రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో నేలవాలిన వరి, మొక్కజొన్న
  • ఈదురుగాలుల కారణంగా రాలిపోయిన మామిడికాయలు
  • మార్కెట్‌‌‌‌ యార్డుల్లోకి నీరు చేరడంతో తడిసిన మిర్చి, మక్క

వెలుగు నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ : సీజన్‌‌‌‌ కాని సీజన్‌‌‌‌లో కురుస్తున్న వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా వానలు పడుతుండడంతో రైతులు భారీగా నష్టపోయారు. వర్షానికి తోడు ఈదురుగాలులు వీస్తుండడం, వడగండ్లు పడుతుండడంతో వేలాది ఎకరాల్లో వరి, మక్క నేలవాలి, వడ్లు తడిసిపోగా.. వందలాది ఎకరాల్లో మామిడి దెబ్బతింది. 
 
కామారెడ్డి జిల్లాలోని  నస్రుల్లాబాద్, బీర్కూర్‌‌‌‌, బాన్సువాడ మండలాల్లో సుమారు 30 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. వడ్లు రాలిపోయాయి.
   
మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో కురిసిన వర్షం, ఈదురుగాలుల కారణంగా వరి, మిర్చి, మొక్కజొన్న, మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. మహబూబాబాద్‌‌‌‌ మిర్చి యార్డ్‌‌‌‌కు తీసుకొచ్చిన బస్తాలు తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు. కొత్తగూడ, బయ్యారం, డోర్నకల్‌‌‌‌ మండలాల్లో వర్షం, ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కొత్తగూడలోని ముస్మీ ప్రాంతంలో మొక్కజొన్న చేను పూర్తిగా నేలవాలిపోయింది. సీరోలు మండలంలో పీఏసీఎస్‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్‌‌‌‌లోకి నీరు చేరడంతో రైతులు ఎత్తి పోశారు. నరసింహులపేట మండలంలో వరి నేల వాలింది.
   
ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా నేరడిగొండ మండలంలో అకాల వర్షం, వడగండ్లు బీభత్సం సృష్టించాయి. మండలంలో ప్రధానంగా మొక్కజొన్న , జొన్న, నువ్వుల పంటలు దెబ్బతిన్నాయి.
   
గద్వాల జిల్లా ధరూర్, అయిజ, మల్దకల్, మానవపాడు, కేటీ.దొడ్డి మండలాల్లో ఈదురుగాలుల కారణంగా సుమారు 150 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. మానవపాడు మండలంలో ఆరబెట్టిన ఎండుమిర్చిని వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. గద్వాల, మల్దకల్‌‌‌‌ మండలాల పరిధిలో బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. 
   
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌‌‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, వరి, మామిడి, బొప్పాయి తోటలకు నష్టం జరిగింది. గజ్వేల్, వర్గల్ మండలాల్లో 54 ఎకరాల్లో మొక్కజొన్న, 126  ఎకరాల్లో వరి, 40 ఎకరాల్లో మామిడి, 16 ఎకరాల్లో బొప్పాయి, రెండు ఎకరాల్లో సపోట, 18 ఎకరాల్లో టమాట, 12 ఎకరాల్లో మిరప పంటలు దెబ్బతిన్నాయని ఆఫీసర్లు ప్రాథమికంగా గుర్తించారు.
 
వరంగల్‌‌‌‌ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లకుంట తండా, భవానీకుంట తండాలో వరి నేలకొరిగింది. అకాల వర్షంతో నెక్కొండ పట్టణంలోని అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌కు తీసుకొచ్చిన మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది.
 
అకాల వర్షం కారణంగా యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో 80 ఎకరాలకు పైగా, పోచంపల్లి మండలంలో 49 ఎకరాల్లో వరికి నష్టం జరిగింది. అలాగే తుర్కపల్లి, వాసాలమర్రిలో 31 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వర్షం కారణంగా జిల్లాలో సుమారు రూ.కోటికి పైగా నష్టం జరిగినట్లు ఆఫీసర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 

సర్వం కోల్పోయాం.. ఆదుకోండి ! 

మంత్రిని చూసి రైతులు కంటతడి 

జయశంకర్‌‌‌‌భూపాలపల్లి/ములుగు, వెలుగు : ‘అకాల వర్షంతో సర్వం కోల్పోయాం.. ప్రభుత్వం తరఫున ఆదుకోండి’ అంటూ అకాల వర్షానికి నష్టపోయిన రైతులు సీతక్కకు మొరపెట్టుకున్నారు. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలో గురువారం కురిసిన వర్షానికి వడ్లు తడిసిపోయాయి. మంత్రి సీతక్క శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రిని చూసి రైతులు ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తడిసిన వడ్లను కొంటామని, బాధిత రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావుకు ఫోన్‌‌‌‌ చేసి పంట నష్టాన్ని వివరించి బాధితులను ఆదుకోవాలని కోరారు. నష్టం అంచనాలను రూపొందించాలని ఆఫీసర్లను ఆదేశించారు. అకాల వర్షం కారణంగా సుమారు 650 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ఆఫీసర్లు మంత్రికి వివరించారు.