
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
- పలుచోట్ల పడిన పిడుగులు
- ఓ మహిళకు గాయాలు
సిద్దిపేట/ చేర్యాల/కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లాలో సోమవారం సాయంత్రం అకాల వర్షం, వడగండ్లు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోగా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ధాన్యం వరద నీటిలో కొట్టుకపోయింది. ఈదురుగాలులకు పలు ఇండ్ల పైకప్పులు లేచిపోగా మామిడి, వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ధూల్మిట్ట మండల కేంద్రంతో పాటు తొర్నాల, జాలపల్లి, ములుగు మండలం బస్వాపూర్ గ్రామాల్లో పిడుగులు పడ్డాయి. బస్వాపూర్ లో ఓ ఇంటిపై పిడుగుపడడంతో భవాని అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. పలు గ్రామాల్లో స్తంభాలు విరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ధూల్మిట్ట మండలంలో తహసీల్దారు మధుసూదన్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జగదేవపూర్, తిమ్మాపూర్, దౌలాపూర్, మునిగడప, వట్టిపల్లి, లింగారెడ్డిపల్లి, బీజీ వెంకటాపూర్ గ్రామాల్లో మామిడి తోటలో కాయలు నేలరాలగా, జగదేవపూర్ లో హోల్ సెల్ చెప్పుల దుకాణం షెడ్ కుప్పకూలింది. పలుచోట్ల పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి లో షేక్ మదర్ కు చెందిన ఇంటి పై కప్పు రేకులు కొట్టుకుపోయాయి.